హైదరాబాద్ మేయర్ ఎన్నిక ఫిబ్రవరి 11న
ఎట్టకేలకు జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికకు ముహుర్తం ఖరారైంది. ఎన్నికలు జరిగి..ఫలితాలు ఎప్పుడో వెల్లడైనా కూడా మేయర్ ఎన్నికపై మాత్రం ఇప్పటివరకూ సస్పెన్స్ కొనసాగుతూ వచ్చింది. శుక్రవారం నాడు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఫిబ్రవరి 11న నూతన మేయర్‌తో పాటు డిప్యూటీ మేయర్‌ను ఎన్నుకోనున్నారు. ఈ మేరకు శుక్రవారం జీహెచ్‌ఎంసీ మేయర్ ఎన్నికకు సంబంధించి ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిబ్రవరి 11న ఉదయం 11 గంటలకు కార్పొరేటర్లు ప్రమాణస్వీకారం చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికను నిర్వహించనున్నారు. ఈ ఎన్నిక పర్యవేక్షణకు సంబంధించి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించనున్నారు.
ఏదైనా కారణం వల్ల ఫిబ్రవరి 11న ఎన్నిక జరగకపోతే మరుసటి రోజు ఎన్నిక నిర్వహిస్తారు. ప్రస్తుత జీహెచ్‌ఎంసీ పాలకమండలి పదవీకాలం వచ్చే నెల 10వ తేదీతో ముగిసింది. ఇప్పటికే కొత్తగా ఎన్నికైన 150 మంది కార్పొరేటర్ల పేర్లను నమోదు ఈసీ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. డిసెంబర్‌లో జరిగిన గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో హంగ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. అధికార టీఆర్‌ఎస్ 55 సీట్లకే పరిమితమైంది. 2016 ఎన్నికల్లో 99 చోట్ల నెగ్గి ఏకపక్షంగా గ్రేటర్ మేయర్ పీఠాన్ని సొంతం చేసుకున్న గులాబీ పార్టీకి ఈసారి ఏకంగా 44 స్థానాలు తగ్గాయి. మరి మేయర్ ఎన్నికకు టీఆర్ఎస్ ఎంఐఎం సాయం తీసుకుంటుందా లేదా అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.