హుజూరాబాద్ ఎన్నిక 'గంట కొట్టారు'
తెలంగాణ రాజకీయాలను మలుపుతిప్పనున్న హుజూరాబాద్ ఎన్నికకు రంగం సిద్ధం అయింది. ఎన్నికల కమిషన్ ఎట్టకేలకు ఈ ఎన్నిక షెడ్యూల్ జారీ చేసింది. హుజురాబాద్ ఉప ఎన్నిక అక్టోబర్ 30న జరగనుంది. నవంబర్ 2 ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ అక్టోబర్ 1న వెలువడనుంది. అక్టోబర్ 8 వరకూ నామినేషన్లకు అవకాశం ఉంటుంది.తెలంగాణలోని హుజూరాబాద్ తోపాటు ఏపీలో బద్వేల్ ఉప ఎన్నిక కూడా జరగనుంది. హుజూరాబాద్ ఎన్నికకు సంబంధించి ఇప్పటికే బిజెపి తరపున మాజీ మంత్రి ఈటెల రాజేందర్ బరిలో నిలవగా..అధికార టీఆర్ఎస్ గెల్లు శ్రీనివాస్ ను అభ్యర్ధిగా బరిలో నిలిపింది. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా అభ్యర్ధిని ఖరారు చేయాల్సి ఉంది. తెలంగాణలో హుజూరాబాద్ ఎన్నిక రాజకీయంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన సంగతి తెలిసిందే.
ప్రభుత్వం దళిత బంధు పథకం అమలుకు ఈ నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుని ఏకంగా 2000 కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు చేయటానికి రెడీ అయిన విషయం తెలిసిందే. తెలంగాణ భవిష్యత్ రాజకీయాలకు ఈ ఎన్నిక అత్యంత కీలకం కావటంతో అటు టీఆర్ఎస్, ఇటు బిజెపి దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. షెడ్యూల్ రావటంతో హుజూరాబాద్ లో రాజకీయ వేడి మరింత పెరనుంది. దేశ వ్యాప్తంగా మూడు లోక్ సభ స్థానాలకు, 14 రాష్ట్రాల్లో 30 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక జరగనుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.