పనులు చేయకుండానే వంద కోట్ల బిల్లుల డ్రా
వంద కోట్ల రూపాయల స్కామ్. అది కూడా సాగునీటి శాఖలో. పనులు చేయకుండా బిల్లులు డ్రా చేశారని టీపీసీసీ కార్యదర్శి బండి సుధాకర్ గౌడ్ ఆరోపించారు. వీటిపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఆయన డైరెక్టర్ జనరల్ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్, ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. వరంగల్ జిల్లాలోని ఎస్.ఆర్.ఎస్.పి., డీబీఎం 48 సి.సి. హెచ్. డివిజన్ నెం. 4 పరిధిలోని తీగరాజుపల్లి, పర్వతగిరి, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం జిల్లాలోని తీర్థాల వరకు అభివృద్ధి పనుల కోసం రూ.123 కోట్ల ఖర్చుతో పనులు చేపట్టేందుకు నిధులు మంజురు చేయడం జరిగింది. ఈ నిధులతో డీబీఎం 48, 1ఆర్ 2ఎల్, 3ఎఆర్, 6ఎల్, 10ఆర్, 1,13 ఆర్, 16 ఆర్, 17 ఎల్, 21ఆర్, 24 ఆర్, 25 ఎల్, 26 ఎల్, 27 ఎల్, 28 ఆర్, 29 ఎల్, 30 ఆర్, 31 ఎల్, 32 ఎల్, 34 ఆర్, 35 ఎల్, 26 ఆర్, 38 ఆర్ ఉప కాల్వల అభివృద్ధి, ఎర్త్ వర్క్ బ్యాంకింగ్, సిసి లైనింగ్, ఇన్స్ పెక్షన్ పాత్ పనులు చేపట్టాల్సి ఉంది.అయితే, ఈ పనులు చేయకుండానే కాంట్రాక్టర్లు, అధికారులు, రాజకీయ నాయకులు కుమ్మక్కై దాదాపు రూ.17 కోట్ల పనులు జరిగినట్లుగా బిల్లులు రికార్డు చేసుకొని, డబ్బులు డ్రా చేసుకున్నారని బండి సుధాకర్ గౌడ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. క్వాలిటీ కంట్రోల్ అధికారులు కూడా తనిఖీలు చేయకుండానే కాంట్రాక్టర్ల దగ్గర పర్సంటేజీలు తీసుకొని క్వాలిటీ సర్టిఫికెట్ జారీ చేయడం దారుణమన్నారు. దాదాపు 20 కోట్ల రూపాయలతో పర్వతగిరి పెద్ద చెరువు పనులు కూడా నాణ్యత లేకుండా చేశారని, దీనిపై అక్కడ పనిచేసిన ఏఈ విజిలెన్స్ శాఖకు ఫిర్యాదు చేస్తే తూతూ మంత్రంగా విచారణ జరిపారన్నారు. విచారణాధికారి అయిన విజిలెన్స్ డీఈ శ్రీనివాస్ సదరు కాంట్రాక్టర్ల వద్ద రూ. 50 లక్షలు లంచం తీసుకొని, వారికే వత్తాసు పలకడం శోచనీయమన్నారు. వరంగల్ జిల్లాలోని డీబీఎం 38 ప్యాకేజీ పనులు గీసుకొండ, మల్లంపల్లి, పరకాల వరకు రూ.123 కోట్ల అంచనా వ్యయంతో డోవెల్ బ్యాంకింగ్ సిసి లైనింగ్, ఇన్స్ పెక్షన్ పాత్ అభివృద్ధి కొరకు నిధులు మంజూరు చేశారన్నారు.
డీబీఎం 48, డీబీఎం 38లలోని పనులను కాంట్రాక్టర్లు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, స్వర్ణ ఎలక్ట్రికల్స్ అండ్ కాంట్రాక్టర్స్ అధినేత సురేశ్ రావు, సుమన్ రావు దక్కించుకున్నారని బండి సుధాకర్ గౌడ్ తెలిపారు. వీరు నాణ్యత లేకుండానే కొన్ని పనులు చేశారని, మరికొన్ని పనులు చేయకుండానే బిల్లులు రికార్డు చేసుకొని ప్రజా ధనాన్ని అప్పనంగా కొట్టేశారని ఆయన ఆరోపించారు. ఇందులో మొత్తం రూ.240 కోట్ల రూపాయల పనుల్లో దాదాపు .100 కోట్ల రూపాయలను కాంట్రాక్టర్లు, అధికారులు, అధికార పార్టీ నాయకులతో కుమ్మక్కై, ప్రజాధనాన్ని కాజేశారని బండి సుధాకర్ గౌడ్ ఆరోపించారు. వీరి అవినీతిని ప్రశ్నించిన ఒక ఏఈని తమ రాజకీయ పలుకుబడితో ఖమ్మంకు ట్రాన్స్ ఫర్ చేయించారని, అంతేగాకుండా ప్రస్తుత ఈఈ వెంకటేశ్వర్లును కాపాడేందుకు ఒక ఏడాదికాలంలో నలుగురైదుగురు ఈఈలను ట్రాన్స్ ఫర్ చేయించారంటే వాళ్లు ఎంత పకడ్బందీగా అక్రమాలకు పాల్పడుతున్నారో అర్థమవుతుందని ఆయన అన్నారు. వరంగల్ ఇరిగేషన్ శాఖలో జరిగిన దాదాపు రూ.100 కోట్ల అవినీతి, అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.