హైరైజ్ బిల్డింగ్ అనుమతుల్లో అక్రమాలు..కోట్ల రూపాయల అవివీతి
తెలంగాణ బిల్డర్ల దరఖాస్తులకు అనుమతి ఇవ్వకుండా..నార్సింగ్ తోపాటు పలు కీలక ప్రాంతంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ భారీ ఎత్తున అక్రమంగా హైరైజ్ బిల్డింగ్ లకు అనుమతులు ఇస్తున్నారని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారంలో మంత్రి కెటీఆర్ , అధికారులు కొంత మంది టీమ్ లను పెట్టుకుని కోట్ల రూపాయలు వసూళ్ళు చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలా అక్రమంగా అనుమతి ఇచ్చిన వాటి జాబితా త్వరలోనే బయటపెడతానన్నారు. ఏ ఉద్దేశంతో తెలంగాణ సాధించామో..అది విస్మరించి సీఎం కెసీఆర్ రాష్ట్రాన్ని బీహారిల చేతిలో బందీ చేశారని మండిపడ్డారు. తెలంగాణకు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ లు ఎవరూ కీలక పోస్టులకు పనికిరారా అని ప్రశ్నించారు. కెసీఆర్ కేవలం తన దోపిడీకి సహకరించే బీహారీ ఐఏఎస్, ఐపీఎస్ లకే కీలక పోస్టులు ఇచ్చి దోచుకుంటున్నారని ఆరోపించారు. ఉన్నత చదువులు చదివి..కీలక పోస్టులు పొందిన వారు ఈ అక్రమాలపై ఇప్పటికైనా నోరు తెరవాలని డిమాండ్ చేశారు. కెసీఆర్ చేసే అక్రమాలకు సీఎస్ సోమేష్‌కుమార్, డీజీపీ అంజనీకుమార్‌తో పాటు.. రజత్‌కుమార్, అరవింద్‌కుమార్, సందీప్‌కుమార్ సుల్తానియాలు సహకరిస్తున్నారని తెలిపారు. వీరంతా బీహార్ వాళ్లేనన్నారు.
ఇప్పుడు ఎన్నికల కోసం సలహాదారు ప్రశాంత్ కిషోర్ ను కూడా బీహార్ నుంచే తెచ్చుకున్నారని తెలిపారు. బీహార్‌కు చెందిన మంత్రి సంజయ్‌కుమార్ ఝూ తనపై దాడి చేస్తున్నారని, కేసీఆర్‌ను ఎలా ప్రశ్నిస్తావంటూ సంజయ్‌కుమార్ అంటున్నారని రేవంత్‌రెడ్డి తెలిపారు. అంటే వీళ్ల నెట్ వర్క్ ఎలా ఉందో చూడాలని కోరారు. ధరణి పోర్టల్‌లో లోపాల కారణంగా భూ వివాదాలు వస్తున్నాయని రేవంత్ వ్యాఖ్యానించారు. ఇది చూస్తున్నది కూడా సోమేష్ కుమారే అన్నారు. ఇబ్రహీంపట్నంలో కాల్పులకు కూడా ఇదే కారణమన్నారు. ఇబ్రహీంపట్నం కాల్పుల్లో బీహార్‌కు చెందిన గ్యాంగ్ ఉందని, 20 ఏళ్ల క్రితం యజమానులుగా ఉన్నవారి పేర్లు ధరణి పోర్టల్‌లో వస్తున్నాయన్నారు. ప్రస్తుత భూ యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దీనివల్ల భూవివాదాలు వచ్చి హత్యలకూ తెగబడుతున్నారని రేవంత్‌రెడ్డి అన్నారు. ధరణి పోర్టల్‌ను అడ్డంపెట్టుకుని నిజాం కాలంనాటి భూములు గోల్‌మాల్ అవుతున్నాయన్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల భూములను కబ్జా చేస్తున్నారని, ఆర్డీవో కార్యాలయంలో భూముల రికార్డులు మాయం అయ్యాయన్నారు. డీజీపీ మహేందర్ రెడ్డి అకస్మాత్తుగా సెలవుపై ఎందుకు వెళ్ళారో అర్ధం కావటంలేదని..ఆయన ఎక్కడా వైద్యం చేయించుకుంటున్నట్లు కూడా తనకు తెలియదన్నారు. దీని వెనక ఏమి జరిగిందో తేలాల్సి ఉందన్నారు.