హైదరాబాద్ లో హై-స్పీడ్ టాటా.ఈవీ మెగాచార్జర్ హబ్

దేశంలో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు వేగంగా పెడుతున్నాయి. గత కొన్ని నెలలుగా ఈ జోరు మరింత పెరిగింది. దీంతో దేశంలోని దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు తమ అమ్మకాలు మరింత పెంచుకునేలా మౌలిక సదుపాయాలు కూడా పెంచుకుంటూ వెళుతున్నాయి. అందులో భాగంగానే ప్రముఖ ఈవీ చార్జింగ్ సొల్యూషన్స్ సంస్థ టాటా పవర్, ఫోర్ వీలర్ ఈవీల తయారీ దిగ్గజం టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ (టీపీఈఎం) కలిసి తెలంగాణలో మొట్టమొదటి హై-స్పీడ్ టాటా.ఈవీ మెగా చార్జర్ హబ్‌ని ప్రారంభించాయి. హైదరాబాద్ హైటెక్ సిటీలోని ఐల్యాబ్స్ సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్‌లో దీన్ని ఏర్పాటు చేశాయి. మొత్తం 360 కిలోవాట్ల (kW) చార్జింగ్ సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ఈ మెగాచార్జర్ హబ్‌లో మూడు 120 కిలోవాట్ల డిస్పెన్సర్లు ఉన్నాయి. వీటి సహాయంతో ఒకే సమయంలో ఆరు ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్ చేయవచ్చు. 24 గంటలూ పనిచేసే ఈ సదుపాయం వల్ల చార్జింగ్ సమయం గణనీయంగా తగ్గుతుంది.
సొంత వాహనదారులు, కమర్షియల్ ఫ్లీట్స్, ఇంటర్‌సిటీ ప్రయాణికులకు ఈ హబ్ అనువుగా ఉంటుంది అని సంస్థ వెల్లడించింది. పర్యావరణ హితమైన, భవిష్యత్తు కాలానికి సర్వసన్నద్ధమైన రవాణా వ్యవస్థ వైపు తెలంగాణ అడుగులు వేయడంలో ఇది మరొక కీలక మైలురాయిగా మారుతుంది అని తెలిపారు. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలతో (ఓఈఎంలు) కలిసి, టాటా పవర్ ఇప్పటికే 2.3 లక్షలకు పైగా హోమ్ చార్జర్లను కూడా ఏర్పాటు చేసింది. తద్వారా ఈవీ వినియోగదారులకు సమగ్రమైన చార్జింగ్ పరిష్కారాలను అందిస్తోంది. దేశవ్యాప్తంగా కీలక ప్రాంతాలలో చార్జింగ్ నెట్‌వర్క్‌ను విస్తరిస్తూ, భారతదేశపు స్వచ్ఛమైన రవాణా మార్పును వేగవంతం చేయడానికి మరియు దేశ దీర్ఘకాలిక ఇంధన పరివర్తన, నెట్-జీరో (ఉద్గారాల నివారణ) లక్ష్యాలకు మద్దతు ఇవ్వడానికి టాటా పవర్ కట్టుబడి ఉంది అని పేర్కొన్నారు.



