Telugu Gateway
Telangana

వరద సాయం డిసెంబర్ 4 తర్వాతే చేయాలి

వరద సాయం డిసెంబర్ 4 తర్వాతే చేయాలి
X

డిసెంబర్ 4 తర్వాతే వరద సాయం కింద ఇస్తున్న పది వేల రూపాయలు పంపిణీ చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. వరద బాధితులకు సహాయం యధావిధిగా కొనసాగించాలన్న పిటీషన్ పై మంగళవారం నాడు హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రభుత్వంతో చర్చించకుండా వరద బాధితులకు ఇచ్చే 10,000 రూపాయల సహాయం ఆపడం రాజ్యాంగ విరుద్ధమని పిటీషనర్ శరత్ కోర్టుకు నివేదించారు. వరద బాధితులకిచ్చే సహాయం మోడల్ కోడ్ అఫ్ కండక్ట్ క్రింద రాదని చెప్పిన ఎన్నికల కమిషన్‌.. 24 గంటల వ్యవధిలోనే మాట మార్చిందని పిటిషన్‌దారు తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్‌ కన్నా ముందే వరద బాధితుల సహాయం పథకం అమలులోకి వచ్చిందని తెలిపారు. దీంతో దాన్ని ఆపడం పొలిటకల్‌ ఎజెండా అవుతుందని శరత్‌ కుమార్‌ కోర్టుకు తెలిపారు. పిటిషన్‌దారు వాదనలు విన్న కోర్టు ఎన్నికలు ఉన్నాయని ముందుగానే తెలుసా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందే బాధితుల అకౌంట్‌లో డబ్బులు ఎందుకు వేయలేదని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. వరద బాధితుల కోసం విడుదల చేసిన ఫండ్‌ని కొంతమంది పార్టీ వాళ్ళకే ఇస్తున్నారని.. అందుకే ఆ పథకాన్ని ప్రస్తుతం ఆపాలని నిర్ణయించామని ఎలక్షన్‌ కమిషన్‌ కోర్టుకు తెలిపింది.

పథకం తప్పుదోవ పడుతుందనే ఉద్దేశంతోనే నిలిపివేశామని.. కేవలం ఎన్నికల జరిగేంత వరకే దీనిని ఆపామని.. తర్వాత యధావిధిగా కొనసాగించుకోవచ్చని ఎలక్షన్ కమిషన్‌‌ కోర్టుకు విన్నవించింది. ఎన్నికల ముందు ఈ సహాయం చేయడం వలన ఓటర్ల మీద తీవ్ర ప్రభావం పడుతుందని ఎన్నికల కమిషన్ తెలిపింది. గత నెల 20 న ప్రారంభమైన ఈ పథకం పది రోజులు ఆపితే ఎలాంటి నష్టం లేదని ఎన్నికల కమిషన్ పేర్కొన్నది. వరద బాధితుల సహాయ పథకం కేవలం జీహెచ్‌ఎంసీ వరకే పరిమితమా లేక మొత్తం రాష్టానికి వర్తింస్తుందా అని కోర్టు ఏజీని ప్రశ్నించింది. వచ్చే నెల 4 న కౌంటర్ ధాఖలు చేసి పూర్తి నివేదిక సమర్పించాలన్న హైకోర్టు ఆదేశించింది. 4వ తారీఖు తర్వాత డబ్బుల పంపింణీ చేయొచ్చని తెలుపుతు.. తదుపరి విచారణను హై కోర్టు వచ్చే నెల 4 కు వాయిదా వేసింది.

Next Story
Share it