Telugu Gateway
Telangana

నితిన్ నిర్ణ‌యం వెన‌క ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌భావం!

నితిన్ నిర్ణ‌యం వెన‌క ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌భావం!
X

విజ‌య్ దేవ‌ర‌కొండ రాక ముందు వ‌ర‌కూ తెలంగాణ ప్రాంతానికి చెందిన ఈ త‌రం పాపుల‌ర్ హీరోల్లో నితిన్ ఒక‌రు. ఇప్పుడు ఇటు విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అటు నితిన్ కూడా తెలంగాణ ప్రాంతం నుంచి కీలక హీరోలుగా ఉన్నారు. నితిన్ ఆక‌స్మాత్తుగా బిజెపి జాతీయ అధ్యక్షుడు జె పి న‌డ్డాతో భేటీ కావ‌టం సినీ, రాజ‌కీయ వ‌ర్గాల్లో ఒకింత ఆస‌క్తిని రేపింది. అస‌లు నితిన్ నడ్డాతో భేటీ కావ‌టమే చ‌ర్చ‌కు తెర‌తీసింది. న‌డ్డా, నితిన్ భేటీ అనంత‌రం బిజెపికి చెందిన సీనియ‌ర్ నేత‌, ఎంపీ కె. ల‌క్ష్మ‌ణ్ చేసిన వ్యాఖ్య‌లు మ‌రింత ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి. ప్ర‌ధాని మోడీ దేశం కోసం క‌ష్ట‌ప‌డి ప‌నిచేస్తున్నార‌ని..ఆయ‌న కోసం అవ‌స‌రం అయితే ప్ర‌చారం చేయ‌టానికి కూడా సిద్ధంగా ఉన్న‌ట్లు నితిన్ తెలిపార‌ని ల‌క్ష్మ‌ణ్ వెల్ల‌డించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన నితిన్ అధికార టీఆర్ఎస్ వైపు కాకుండా బిజెపి వైపు చూడ‌టం కూడా కీల‌క ప‌రిణామంగా మారింది. తెలంగాణ‌లో టీఆర్ఎస్, బిజెపిల మ‌ధ్య పొలిటిక‌ల్ వార్ తీవ్రరూపం దాల్చిన వేళ ఆక‌స్మాత్తుగా నితిన్ తెరపైకి వచ్చి ప్ర‌ధాని మోడీ కోసం ప్ర‌చారం చేస్తాన‌ని ప్ర‌క‌టించ‌టం అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

నితిన్ నిర్ణ‌యం వెన‌క‌..అంటే బిజెపి వైపు మొగ్గుచూపాలనే అంశంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రభావం కూడా ఉంటుంద‌నే చ‌ర్చ సాగుతోంది. టాలీవుడ్ హీరో నితిన్ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు వీరాభిమాని అన్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం బిజెపి, జ‌న‌సేన ఏపీలో పొత్తులో కొనసాగుతున్నాయి. భ‌విష్య‌త్ లోనూ కొన‌సాగే అవ‌కాశం ఉంద‌నే అభిప్రాయం ఉంది. నితిన్ తండ్రి సుధాక‌ర్ రెడ్డి టాలీవుడ్ నిర్మాత‌, డిస్ట్రిబ్యూట‌ర్ కూడా. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో సినిమా హీరోలు చెపితే ఓట‌ర్లు ఆయా పార్టీల‌కు ఓట్లు వేస్తారా? వీరి ప్ర‌భావం ఏ మేర‌కు ఉంటుంద‌నే అంశంపై ర‌క‌ర‌కాల అభిప్రాయాలు ఉన్నాయి. అటెన్ష‌న్ డ్రా చేయ‌టానికి..స‌భ‌ల‌కు జ‌నాల‌ను ఆక‌ట్టుకోవ‌టానికి మాత్రం వీళ్లు ఖ‌చ్చితంగా ఉప‌యోగ‌ప‌డ‌తార‌ని చెప్పొచ్చు.

Next Story
Share it