టాలీవుడ్ కు రేవంత్ రెడ్డి పంపిన సందేశం ఏంటి!

టాలీవుడ్ లోనే కాకుండా రాజకీయ వర్గాల్లో కూడా ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తగ్గారా...లేక టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ తగ్గారా?. శనివారం నాడు హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగిన తెలంగాణ గద్దర్ సినిమా అవార్డ్స్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టాలీవుడ్ కు పంపిన సంకేతం ఏంటి?. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నా కూడా రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన అన్ని విధాలుగా సహకరిస్తామని ప్రకటించారు. హైదరాబాద్ లో సినిమా పరిశ్రమ ఎంతో కీలకంగా ఉంది అనే విషయం తెలిసిందే. కఠిన నిర్ణయాలు తీసుకున్నా పరిశ్రమ అభివృద్ధికి సహకరిస్తాం అని చెప్పటం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో జరిగిన పరిణామాలపై వివరణ ఇచ్చుకున్నట్లు ఉంది అనే చర్చ సాగుతోంది. లేకపోతే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మాట మాట్లాడాల్సిన అవసరం ఏముంది అని కొంత మంది సందేహం లేవనెత్తుతున్నారు. మరో వైపు అసెంబ్లీ సాక్షిగా అల్లు అర్జున్ పై తీవ్ర విమర్శలు చేసిన ముఖ్యమంత్రి ఇప్పుడు అవి అన్ని మర్చిపోయి గద్దర్ అవార్డు లు తీసుకోవటానికి వచ్చిన అల్లు అర్జున్ ను ఆత్మీయంగా హత్తుకుని పలకరించారు.
పుష్ప 2 సినిమా విడుదల సమయంలో సంధ్య థియేటర్లో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందగా...మరో బాలుడు తీవ్ర గాయాలతో ఇప్పటికి ఇంకా కోలుకోలేని స్థితిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం అప్పటిలో పెద్ద దుమారం రేపింది. అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసి ఒక రాత్రి జైల్లో కూడా పెట్టిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే టాలీవుడ్, తెలంగాణ ప్రభుత్వం మధ్య గ్యాప్ బాగా పెరింది. అసెంబ్లీ లో రేవంత్ రెడ్డి చేసిన ఘాటు వ్యాఖ్యలు...బయట అల్లు అర్జున్ వ్యవహరించిన తీరు కూడా వివాదాస్పదం అయింది. ఇప్పుడు అసలు ఆ కేసు ఏమైందే కూడా ఎవరికీ తెలియదు. పుష్ప 2 సినిమా కు గద్దర్ అవార్డు ప్రకటించిన సమయంలో కూడా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. మరో వైపు ఈ అవార్డు తీసుకోవటానికి అల్లు అర్జున్ వస్తారా లేదా అనుమానాలు టాలీవుడ్ వర్గాల్లో వ్యక్తం అయిన సంగతి తెలిసిందే.
అయితే అల్లు అర్జున్ కూడా శనివారం అవార్డు ల కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ అవార్డు ను స్వీకరించటమే కాకుండా వేదికపై ఉన్న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ల అనుమతితో ఒక డైలాగు చెప్పి పుష్ప..పుష్ప రాజ్ అసలు తగ్గేదే లే అని డైలాగు చెప్పటం ద్వారా తాను ఏమీ తగ్గలేదు అనే సంకేతం ఇచ్చారు అనే చర్చ కూడా సాగుతోంది. ఈ కార్యక్రమం లో మాట్లాడిన రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు బాలీవుడ్, హాలీవుడ్ ను కూడా హైదరాబాద్ కు తెచ్చేలా కృషి చేయాలని పరిశ్రమ వర్గాలకు పిలుపునిచ్చారు. దీనికి ప్రభుత్వం తరపున ఎలాంటి సహకారం కావాలన్నా అందిస్తామన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ లో సినీ పరిశ్రమకు ఒక చాప్టర్ ఉంటుంది అన్నారు. 14 సంవత్సరాల తర్వాత తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ రాష్ట్రంలో సినిమా అవార్డులకు శ్రీకారం చుట్టింది.