Telugu Gateway
Telangana

కెసిఆర్ ఎందుకు అంత కష్టపడుతున్నట్లు

కెసిఆర్ ఎందుకు అంత కష్టపడుతున్నట్లు
X

అధికారంలో ఉన్న తొమ్మిదిన్నర సంవత్సరాల్లో కెసిఆర్ చాలా కాలం ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదు. అంటే అయన ప్రగతి భవన్ లో ఉన్నారా...లేక ఫార్మ్ హౌస్ లో ఉన్నారా అనే విషయం ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న వారికి తప్ప బయట ప్రజలకు తెలిసేది కాదు. లేదంటే అయన ఏమి చేశారో ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేస్తే ప్రజలు..పార్టీ నాయకులు కూడా ఓహో కెసిఆర్ ఇది చేశారా అనుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఆయనది అంతా రహస్య పాలనే. అయన సచివాలయానికి వచ్చేవారు కాదు...ప్రజలను కలిసే ఛాన్స్ ఎలాగూ లేదు. కెసిఆర్ చేసినట్లు ఉమ్మడి రాష్ట్రంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా చేయలేదు అనే చెప్పొచ్చు. కానీ ఎన్నికల వేళ బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ తీరు చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు అయన రోజుకు మూడు నుంచి నాలుగు నియోజకవర్గాలలో హెలికాప్టర్ లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు...సభల్లో ఎన్నికల ప్రసంగాలు చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా కెసిఆర్ ప్రచారం చేస్తున్న తీరును రాష్ట్ర ప్రజలు అంతా గమనిస్తున్నారు కూడా. కానీ ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల్లో కెసిఆర్ ఇలా వరసగా ఎప్పుడూ ప్రభుత్వ పరిపాలన కేంద్రం అయిన సచివాలయానికి వచ్చింది లేదు...సమీక్షలు నిర్వహించింది లేదు. రాష్ట్ర ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొన్న సమయంలో కూడా అదే పరిస్థితి. ఎక్కడ వరకో ఎందుకు రాజధాని నగరంలో కొన్ని ప్రాంతాలను భారీ వర్షాలు...వరదలు ముంచెత్తిన సమయంలో కూడా సీఎం కెసిఆర్ బయటకు వచ్చి ప్రజలను పరామర్శించిన సందర్భం లేదు.

రాష్ట్రంలోని కొండగట్టు వద్ద అత్యంత ఘోర ప్రమాదం జరిగి దగ్గర దగ్గర 57 మంది వరకు మరణించినా కూడా సీఎం కెసిఆర్ అటు వైపు చూడలేదు. ఈ విషయంలో ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా కూడా కెసిఆర్ ఏ మాత్రం పట్టించుకోలేదు తప్ప బయటకు వచ్చి వాళ్ళను పరామర్శించిన దాఖలాలు లేవు. చెప్పుకుంటే పోతే ఇలాంటి విషయాలు ఎన్నో. కానీ సీన్ కట్ చేస్తే ఇప్పుడు మాత్రం ఇంచు మించు ప్రతి రోజు బయటకు వచ్చి రోజుకు నాలుగు ఎన్నికల మీటింగ్ ల్లో పాల్గొంటున్నారు. ఇది అంతా చూస్తే సీఎం కెసిఆర్ తన అవసరం కోసం...అంటే వచ్చే ఎన్నికల్లో గెలవటం కోసం ఇప్పుడు ఇంత కష్టపడుతున్నారు తప్ప మరొకటి కాదు అనే చర్చ అన్ని వర్గాల్లో సాగుతుంది. చాలా సార్లు సీఎం కెసిఆర్ ప్రజలను ఎందుకు కలవరు అనే ప్రశ్నకు అసలు సీఎం తో ప్రజలకు పని ఏమి ఉంటది అంటూ మంత్రి కేటీఆర్ కొత్త కొత్త వాదనలు తెరపైకి తెస్తున్న విషయం తెలిసిందే. ప్రజలు సమస్యలు చెప్పుకోవటానికి సీఎం దగ్గరకు వచ్చారు అంటే అది వ్యవస్థ వైఫల్యమే అంటూ సమస్యను పక్క దారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఎన్నికల సమయంలో కూడా కేటీఆర్ ఇదే లాజిక్ ను అప్లై చేయవచ్చు కదా. సీఎం దగ్గరకు పోకుండానే మీ సమస్యలు అన్ని తీర్చేశాం అని మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రమే ప్రచారం చేస్తే సరిపోయేది కదా...కెసిఆర్ ఎందుకు ఇంతగా కష్టపడుతున్నట్లు ఎన్నికల కోసం.తొలి టర్మ్ లో అయినా...ఇప్పుడు అయినా కెసిఆర్ ఇంతగా బయటకు వచ్చింది కేవలం ఎన్నికల ప్రచారం కోసమే తప్ప...ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు కాదు..వారికీ సమస్యలు వచ్చినప్పుడు కాదు అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు.

Next Story
Share it