ఇది రాజ్యాంగ ఉల్లంఘనే అంటున్న అధికారులు!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం దావోస్ టూర్ లో ఉన్నారు. ఎప్పటిలాగానే పెట్టుబడుల సాధన కోసం ఆయన పరిశ్రమల శాఖ మంత్రి డీ. శ్రీధర్ బాబు, ఇతర అధికారులతో కలిసి ప్రస్తుతం దావోస్ లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన ముగిసిన వెంటనే రేవంత్ రెడ్డి అమెరికా వెళ్లనున్నారు. అది కూడా స్టడీ టూర్ కోసం. ఐదు రోజుల పాటు ఈ టూర్ కొనసాగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అమెరికాలోని హార్వర్డ్ కెన్నెడీ స్కూల్‌లో నిర్వహించే “ 21వ శతాబ్దం కోసం నాయకత్వం అనే కార్యక్రమానికి తన పేరు నమోదు చేసుకున్నారు. స్వతంత్ర భారతదేశంలో ఐవీ లీగ్ లీడర్‌షిప్ కోర్సుకు హాజరయ్యే తొలి ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఆయన నిలిచారు అని తెలంగాణ సమాచార, పౌర సంబంధాల శాఖ అధికారికంగా వెల్లడించింది.
ఈ కార్యక్రమం జనవరి 25 నుంచి 30 వరకు మాసాచుసెట్స్ రాష్ట్రంలోని కేంబ్రిడ్జ్‌లో జరగనుంది. 20 కి పైగా దేశాల నుంచి వివిధ విభాగాలకు చెందిన వాళ్ళు ఇందులో పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరగతులకు హాజరై, అసైన్‌మెంట్లు పూర్తి చేసి, కోర్సు సర్టిఫికేషన్ పొందనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ కోర్స్ లో చేరటం...సర్టిఫికెట్ సాదించాలనుకోవటంపై ఎలాంటి వివాదం లేదు. కానీ ప్రభుత్వం చెప్పిన తేదీల ప్రకారం చూస్తే సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో జనవరి 26 న జరిగే గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొనే ఛాన్స్ లేదు అని స్పష్టంగా కనిపిస్తోంది. గణతంత్ర దినోత్సవం రోజు జాతీయ జెండా ఆవిష్కరణ చేసేది రాష్ట్ర గవర్నర్ అయినా కూడా ఈ కార్యక్రమంలో రాజ్యాంగం ప్రకారం ప్రమాణస్వీకారం చేసిన ముఖ్యమంత్రి కూడా విధిగా పాల్గొంటారు. కానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్టడీ టూర్ కోసం అమెరికా వెళ్లి ఈ కార్యక్రమానికి దూరంగా ఉండటం ఏ మాత్రం సరికాదు అని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది రాజ్యాంగ ఉల్లంఘన కిందే వస్తుంది అని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి అభిప్రాయపడ్డారు.
స్టడీ టూర్ కోసం అని అమెరికా వెళ్లి గణతంత్ర దినోత్సవ కార్యక్రమానికి దూరంగా ఉండటం తప్పుడు సంకేతాలు పంపుతుంది అని, ఇది కచ్చితంగా ప్రోటోకాల్ ఉల్లంఘన అవుతుంది అధికారులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ మరో విశేషం ఏమిటి అంటే తెలంగాణాలో బిఆర్ఎస్ పదేళ్ల హయాంలో పలు మార్లు అప్పటి సీఎం కెసిఆర్ అప్పటి గవర్నర్ తమిళ సై తో వివాదాల కారణంగా గణతంత్ర దినోత్సవాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అప్పటిలో కూడా దీనిపై పెద్ద ఎత్తుగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారం అప్పటిలో కోర్ట్ కు ఎక్కింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి రాజకీయ కారణాలు కాకుండా స్టడీ టూర్ కోసం ఇప్పుడు గణతంత్ర దినోత్సవానికి దూరంగా ఉండనుండటం తీవ్ర విమర్శలకు కారణం అయ్యే అవకాశం ఉంది.



