కెసీఆర్ ఆశీస్సులతో మూడవ సారి బడ్జెట్
తెలంగాణ శాసనసభలో 2022-23 ఆర్ధిక సంవత్సరానికి ఆర్ధిక మంత్రి హరీఫ్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా మంత్రి సోమవారం ఉదయం టీటీడీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కెసీఆర్ ఆశీస్సులతో మూడవ సారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. ఉదయం 11.30 నిమిషాలకు శాసన సభ లో తాను ,మండలి లో మంత్రి ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెడతామన్నారు. ప్రజల ఆకాంక్షలకి అనుగుణంగా, ప్రజలకు ఇచ్చిన హామీలకు నెరవేర్చేలా ఈ బడ్జెట్ ఉంటుందని తెలిపారు. మానవీయ కోణంలో ఈ బడ్జెట్ ను రూపొందించామని వెల్లడించారు.
సహజంగా బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉండటం ఆనవాయితీ. కానీ తెలంగాణ సర్కారు ఈ సారి అందుకు తిలోదకాలు ఇచ్చింది. ఈ విషయంలో సర్కారు తీరును గవర్నర్ తప్పుపడుతూ ప్రకటన కూడా విడుదల చేశారు. అంతే కాదు..సమావేశాల మొదటి నుంచే బడ్జెట్ ప్రవేశపెట్టడం కూడా అరుదు. ఈ విషయంలో కూడా సర్కారు ఓ కొత్త పద్దతికి శ్రీకారం చుట్టినట్లు అయింది. గవర్నర్ ప్రసంగాన్ని ఎత్తేయటంపై కాంగ్రెస్ పార్టీతోపాటు బిజెపి కూడా తప్పుపట్టింది.