Telugu Gateway
Telangana

కేటీఆర్, హరీష్ చెరో దారి

కేటీఆర్, హరీష్ చెరో దారి
X

బిఆర్ఎస్ కీలక నేతల మధ్య సమన్వయం లేదా?. పదేళ్ల పాలన తర్వాత ఆ పార్టీ నేతలు వ్యవహరిస్తున్న తీరు చూస్తే వీళ్ళు ఫుల్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్లు కనిపిస్తోంది అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సహజంగా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుతీరితే ఎవరైనా వాళ్లకు కొంత సమయం ఇస్తారు. కానీ బిఆర్ఎస్ మాత్రం అందుకు బిన్నంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆగమాగం చేయటానికే ప్రయత్నం చేస్తూ వస్తోంది. అయితే ఇందుకు కొన్ని ఛాన్స్ లు అధికార కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అనే విమర్శలు కూడా లేకపోలేదు. ఇది ఇలా ఉంటే సరిగా రెండు రోజుల క్రితం బిఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణాలో సాగుతున్న కూల్చివేతలపై కాంగ్రెస్ అగ్రనేత, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కి లేఖ రాశారు. అందులో తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం నడుస్తుందంటూ ఆరోపించారు. అధికార దుర్వినియోగంతో దుర్మార్గ, దుష్ట పాలన నడుస్తుందని అన్నారు. భారత రాజ్యాంగంలో పొందుపరచిన సహజ న్యాయ సూత్రాలను, చట్టాలను గౌరవించే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రికి సలహా ఇవ్వమని, తద్వారా రాష్ట్రంలో ఖూనీ అవుతున్న ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతూ అయన లేఖ రాశారు.

హరీష్ లేఖ రాసిన రెండు రోజులకు అంటే...బుధవారం నాడు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏకంగా రాహుల్ గాంధీ పైనే ఆరోపణలు చేస్తూ మాట్లాడారు. మూసీ ప్రాజెక్ట్ ను రాహుల్ గాంధీ డబ్బుల సంచుల కోసమే అనుమతి ఇచ్చాడు అన్నారు. హైడ్రాను నడిపించేది రేవంత్ రెడ్డి కాదు రాహుల్ గాంధీ నే అంటూ వ్యాఖ్యానించారు. కేవలం డబ్బుల కోసమే రాహుల్ గాంధీ మూసి ప్రాజెక్ట్ ముందుకు పోయేలా చేస్తున్నారు అంటూ విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ నగరంలో బుల్డోజర్ ప్రభుత్వంతో ప్రజలు చచ్చిపోతుంటే రాహుల్ గాంధీ ఎక్కడ చచ్చిపోయాడు? తెలంగాణలో చిన్నపిల్ల గాడు పిలిచినా సరే వస్తాను అని చెప్పిన రాహుల్ గాంధీ… ఇప్పుడు ఎక్కడ సచ్చాడో చెప్పాలి అంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఒక వైపు సీఎం రేవంత్ రెడ్డి కి చెప్పి బుల్డోజర్ పాలన ఆపాలని హరీష్ రావు తన లేఖ ద్వారా రాహుల్ గాంధీ ని కోరితే ..కేటీఆర్ మాత్రం రాహుల్ కోసమే మూసి ప్రాజెక్ట్ చేపట్టారు అని ఆరోపిస్తూ..ఇది రేవంత్ ప్రాజెక్ట్ కాదు..రాహుల్ ప్రాజెక్ట్ అంటూ చెప్పటం ప్రాధాన్యత సంతరించుకుంది.

Next Story
Share it