గుత్తా మంత్రి పదవి కోరిక నెరవేరటం ఇక కష్టమే!
గుత్తా సుఖేందర్ రెడ్డి. తెలంగాణలో సీనియర్ నేతల్లో ఒకరు. ఒక్కసారైనా మంత్రి కావాలనేది ఆయన కోరిక. ఇందుకు ఆయన చేయని ప్రయత్నం అంటూ లేదు. టీఆర్ఎస్ సర్కారు వచ్చాక ఇప్పటికే ఒక సారి మండలి ఛైర్మన్ పదవి చేపట్టారు. ఆ తర్వాత ఆయన్ను మరోసారి ఎమ్మెల్సీని చేసి మంత్రి చేస్తారని టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరిగింది. కానీ ఈ సారి కూడా ఆయన మంత్రి పదవి ఆశలు గల్లంతు అయ్యాయి. మరోసారి ఆయన తాజాగా శాసనమండలికి ఛైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
దీంతో మంత్రి పదవి ఆశలు హుళక్కి అయినట్లే కన్పిస్తోంది. సోమవారం నాడు శాసనమండలి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా చైర్మన్ స్థానంలో గుత్తా సుఖేందర్ రెడ్డిని మంత్రులు మహమూద్ అలీ, కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ కూర్చోబెట్టారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీలు జీవన్ రెడ్డి, నర్సిరెడ్డి హాజరయ్యారు. మండలి చైర్మన్‌గా ఎన్నికైన గుత్తాకు మంత్రులు, ఎమ్మెల్సీలు అభినందనలు తెలిపారు. అసలు ఇప్పట్లో తెలంగాణ మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు ఎప్పుడో ఉంటాయో కూడా అనిశ్చితి నెలకొని ఉంది.