Telugu Gateway
Telangana

హారిత‌హారం కోసం విరాళాల‌తో 'హ‌రిత‌నిధి'

హారిత‌హారం కోసం విరాళాల‌తో హ‌రిత‌నిధి
X

తెలంగాణ సర్కారు ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన హారిత‌హారం అమ‌లుకు విరాళాలు సేక‌రించాల‌ని నిర్ణ‌యించారు. ఎవ‌రు ఎంత మేర‌కు విరాళాలు ఇవ్వ‌బోతున్నారో ముఖ్య‌మంత్రి కెసీఆర్ శుక్ర‌వారం నాడు శాస‌న‌స‌భా వేదిక‌గా ప్ర‌క‌టించారు. దీని కోస‌మే 'హ‌రిత‌నిధి' ఏర్పాటు చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ముఖ్య‌మంత్రి కెసీఆర్ వ్యాఖ్య‌లు ఆయ‌న మాట‌ల్లోనే...'పచ్చదనం పెంపు పట్ల ప్రతి ఒక్కరు తమ బాధ్యత, పాత్ర పోషించేలా చొరవ తీసుకుంటాం. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల జీతాల నుంచి నెలకు 500 రూపాయలు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు ప్రతీ నెలా 100 రూపాయల విరాళం. ప్రతీ ప్రభుత్వ ఉద్యోగి నుంచి నెలకు 25 రూపాయలు. రిజిస్ట్రేషన్లు, భవనాలు అనుమతులు, వాహన రిజిస్ట్రేషన్ల సమయంలో కొద్ది మొత్తం వసూలు. విద్యార్థుల అడ్మిషన్ల సమయంలో ఒక్కొక్కరి నుంచి ఐదు రూపాయలు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చే సంస్థలు, వ్యక్తుల నుంచి విరాళాల సేకరణ.' చేస్తామ‌న్నారు. గ్రీన‌రీలో ప్ర‌పంచంలోనే తెలంగాణ రాష్ట్రం మూడో స్థానంలో ఉంద‌న్నారు. మొద‌టి స్థానంలో కెన‌డా, రెండో స్థానంలో బ్రెజిల్, మూడో స్థానంలో తెలంగాణ నిలిచింద‌ని తెలిపారు. * యూఎన్‌వో కూడా తెలంగాణ హ‌రిత‌హారం కార్య‌క్ర‌మాన్ని గుర్తించి ప్ర‌శంసించింద‌ని కెసీఆర్ వెల్ల‌డించారు. ప్ర‌పంచ వ్యాప్తంగా వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు మారిపోయాయ‌ని, సామాజిక అడ‌వుల‌తో అనేక ప్ర‌యోజ‌నాలుంటాయన్నారు. జీడీపీలు, జీఎస్‌డీపీలు పెంచినా, వ్య‌క్తులు త‌మ ఆస్తులు పెంచినా.. జీవించ‌లేని ప‌రిస్థితులు లేక‌పోతే ఏం చేయ‌గ‌ల‌మ‌న్నారు. అనేక ర‌కాల ప్ర‌కృతి వైప‌రీత్యాల‌ను త‌ట్టుకోవాలంటే మొక్క‌లు నాటాలి. మొక్క‌లు నాట‌డం ద్వారా ప్ర‌కృతి వైప‌రీత్యాల‌ను అడ్డుకోవ‌చ్చని తెలిపారు.

గ్రామ‌పంచాయ‌తీల్లో న‌ర్స‌రీలు ఏర్పాటు చేశాం. న‌ర్స‌రీల ఏర్పాటులో అట‌వీ అధికారుల కృషి విశేషంగా ఉంద‌ని ప్ర‌శంసించారు. ప‌ల్లె ప్ర‌కృతి వ‌నాలతో చెట్ల‌ ప్రాధాన్య‌త‌ను ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేశాం. 19 472 ఆవాసాల్లో ప‌ల్లె ప్ర‌కృతి వ‌నాలు ఏర్పాటు చేయ‌బ‌డ్డాయి. 13 657 ఎక‌రాల్లో ఈ వ‌నాలు పెరుగుతున్నాయి. స‌ర్పంచ్‌ల‌ను హృద‌య‌పూర్వ‌కంగా అభినందిస్తున్నాను. ప‌ల్లె ప్ర‌కృతి వ‌నాల‌ను స‌ర్పంచ్‌లు, మిగ‌తా అధికారులు అద్భుతంగా తీర్చిదిద్దారు. 230 కోట్ల మొక్క‌లు నాటాల‌ని హ‌రిత‌హారం కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించాం. 1987లో ఎమ్మెల్యేగా ఉన్న‌ప్పుడు సిద్దిపేట‌లో 10 వేల మొక్క‌లు నాటాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాం. ఆ మొక్క‌ల‌ను సేక‌రించేందుకు చాలా క‌ష్ట‌ప‌డ్డాం. అనేక ఇబ్బందులు ప‌డి 10 వేల మొక్క‌లు సేకరించి ప్రోగ్రాం చేశాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంత‌రం 20 కోట్ల మొక్క‌లు అడ‌వుల్లో పెట్టాల‌ని నిర్ణ‌యించాం. వేర్ల ద్వారా 80 కోట్ల మొక్క‌ల‌ను పున‌రుద్ధ‌రించాల‌ని, 100 కోట్ల మొక్క‌లు బ‌య‌ట నాటాల‌ని ప్ర‌యాణం మొద‌లు పెట్టాం. 20 కోట్ల మొక్క‌లు టార్గెట్‌గా పెట్టుకుంటే.. ఇప్ప‌టికే 20.64 కోట్ల మొక్క‌లు నాటాం. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ ప‌రిధిలో 10 కోట్ల మొక్క‌లు టార్గెట్ పెట్టుకుంటే 14.5 కోట్ల మొక్క‌లు నాటాం. అట‌వీ ప్రాంతాల బ‌య‌ట 130 కోట్లు టార్గెట్‌గా పెట్టుకుంటే, 176.82 కోట్లు నాట‌డం జ‌రిగిందని తెలిపారు.

Next Story
Share it