Telugu Gateway
Telangana

‘కెసిఆర్ వన్ మ్యాన్ షో’

‘కెసిఆర్ వన్ మ్యాన్ షో’
X

రాష్ట్ర మంత్రులు ప్రభుత్వంలో భాగం కాదా ?

ప్రజాస్వామ్య పతాక అని చెపుతూ యాడ్ లో మంత్రి ఫోటో కూడా వేయరా?

నిర్మాణ శాఖ పేరు కూడా ప్రస్తావించని తీరుపై విమర్శలు

అధికారుల్లో హాట్ టాపిక్ గా మారిన సర్కారు తీరు

ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి ఒక్కరేనా?. అసలు మంత్రులకు ఏ మాత్రం విలువ లేదా?. కొత్తగా కట్టిన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టి కూడా ముఖ్యమంత్రి కెసిఆర్ ఇలా చేయటం ఏమిటి అంటూ అధికారవర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ నిర్మాణ పనులు చేపట్టింది రోడ్లు, భవనాల శాఖ. ఈ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సచివాలయం నిర్మాణ పనులు సాగిన కాలంలో ఎన్నిసార్లు ఆ పనులు పరిశీలించారో లెక్కే లేదు. వెళ్లిన ప్రతిసారి ఇచ్చిన పత్రిక ప్రకటనల్లో కూడా ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు అంటూ రాసే వాళ్ళు తప్ప సొంతంగా చేసినట్లు కూడా చెప్పుకునే ప్రయత్నం చేసేవారు కాదు. ఇది అంతా అందుకు అంటే ఆదివారంనాడు అట్టహాసంగా ప్రారంభం అవుతున్న నూతన సచివాలయానికి సంబంధించి తెలుగు, ఇంగ్లీష్ పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చారు. వాటిలో ఎక్కడా కూడా ఒక్క కెసిఆర్ ఫోటో తప్ప ఆర్అండ్ బి శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేరు కానీ...కనీసం ఆ శాఖ పేరు కూడా వేయలేదు. కొద్ది రోజుల క్రితం జరిగిన అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సమయంలో కూడా అలాగే చేశారు. ఇప్పుడు వేముల ప్రశాంత్ రెడ్డి కి ఎదురైన పరిస్థితే మరో మంత్రి కొప్పుల ఈశ్వర్ కు కూడా ఎదురైంది. గత కొన్ని నెలల నుంచి ఇదే ట్రెండ్ కొనసాగిస్తున్నారు. అంతకు ముందు ఏదైనా అధికారిక కార్యక్రమాల్లో సీఎం కెసిఆర్ తో పాటు సంబంధిత శాఖ మంత్రి ఫోటో కూడా వేసే వాళ్ళు. ఇప్పుడు అంతా సీఎం ‘కెసిఆర్ వన్ మ్యాన్ షో’ సాగుతోంది అని అధికారులు...కొంత మంది మంత్రులు అంతర్గత సంభాషణల్లో వ్యాఖ్యానిస్తున్నారు.

అయితే కేబినెట్లో ఉండి మంత్రులు దీనిపై మాట్లాడారు అనే విషయం తెలిసిందే. సచివాలయం ప్రారంభోత్సవ ఫుల్ పేజీ యాడ్ లో మాత్రం ప్రజాస్వామ్య పతాక..ఆత్మ గౌరవ సుపరిపాలన వేదిక అంటూ రాశారు కానీ..కనీసం ఆ శాఖ మంత్రి ఫోటో కూడా వేయకుండా యాడ్ వేసి ప్రజాస్వామ్య పతాక అని చెప్పుకోవటాన్ని ఎలా సమర్ధించుకుంటారు అనే విమర్శలు వస్తున్నాయి. ఈ యాడ్ లో అన్ని వివరాలు రాశారు కానీ ...దీనికి మొత్తం ఎంత ఖర్చు పెట్టారు అనే విషయాన్నీ మాత్రం విస్మరించారు. ఎందుకు అంటే తొలుత ఆరు వందల కోట్ల రూపాయల అంచనాతో మొదలైన ఈ పనులు పూర్తి అయ్యే నాటికి ఏకంగా పద మూడు వందల నుంచి పద్నాలుగు వందల కోట్ల రూపాయల వరకు పెరిగినట్లు అధికారులు చెపుతున్నారు. నిజంగా ఈ ఖర్చు విషయంలో ఎలాంటి మతలబు లేకపోతే ప్రభుత్వం ఎన్ని అడుగులు..ఎంత ఎత్తు అంటూ అన్ని లెక్కలు చెప్పి ఖర్చు లెక్క చెప్పకపోవటంతోనే దీనిపై అనుమానాలు పెరుగుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయం ఏదైనా దానికి కాబినెట్ మొత్తానిది బాధ్యత ఉంటుంది. కానీ సీఎం కెసిఆర్ మాత్రం ప్రభుత్వం అన్నా..కాబినెట్ అన్నా ఏదైనా అంతా తానే అన్నట్లు వ్యవరిస్తున్నారు అని...ఉమ్మడి రాష్ట్రము లో కూడా ఎప్పుడు ఇంత దారుణమైన పరిస్థితులు లేవని ఒక మంత్రి వ్యాఖ్యానించారు.

Next Story
Share it