భద్రాచలంలోనూ గవర్నర్ కు అదే అనుభవం
తెలంగాణ గవర్నర్ తమిళ్ సై బహిరంగంగా తనకు వరస పెట్టి అవమానాలు జరుగుతున్నాయని చెప్పినా సర్కారు లైట్ తీసుకున్నట్లే కన్పిస్తోంది. ప్రధానంగా ఆమె పర్యటనల్లో ప్రొటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయి. ప్రొటోకాల్ ఉల్లంఘనలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకునే అధికారం తనకు ఉన్నా..తాను అందుకు సిద్ధంగాలేనని ఇటీవల డిల్లీ పర్యటన సంద్భరంగా ఆమె వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అంతే కాదు..సీఎస్ కు గవర్నర్ ప్రోటోకాల్ తెలియదా? అంటూ ప్రశ్నించారు. సోమవారం నాడు గవర్నర్ తమిళ్ సై శ్రీ రామ పట్టాభిషేకంలో పాల్గొనున్నారు.
ఆమె భద్రాచలం రైల్వే మార్గం ద్వారానే వెళ్లారు. గత కొంత కాలంగా సాగుతున్నట్లు ఈ సారి కూడా గవర్నర్ భద్రాచలం పర్యటన సందర్భంగా ఆమె కలెక్టర్, ఎస్పీలు స్వాగతం పలకలేదు. భద్రాచలం ఆలయంలో అధికారులు, పూజారులు గవర్నర్ కు స్వాగతం పలికి తోడ్కోని వెళ్లారు. అనంతరం ఆమె మాట్లాడుతూ భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి వారిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతమని అన్నారు. భక్త రామదాసు నిర్మించిన ఆలయాన్ని, సీతారాములను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.