టీడీపీ నిర్ణయంతో ఎవరికి మేలు!
మాములుగా అయితే ఒక రాజకీయ పార్టీ..అది ఏదైనా ఎన్నికల బరిలో నిలవక పోవటం ఏ మాత్రం సరైన నిర్ణయం కాదు. తెలుగు దేశం పార్టీ ఇప్పుడు అదే నిర్ణయం తీసుకుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వార్ ఇప్పుడు బిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్న చందంగా మారిపోయింది. బీజేపీ రేస్ లో ఉన్నా ప్రధాన పోటీ బిఆర్ఎస్, కాంగ్రెస్ ల మద్యే. దీంతో తెలంగాణాలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగు దేశం పార్టీ పోటీ కి దూరంగా ఉండటం ఎవరికీ లాభం...ఎవరి నష్టం అన్న చర్చ తెర పైకి వచ్చింది. టీడీపీ ఎన్నికల బరిలో ఉన్నా ఎన్ని సీట్లు గెలుస్తుంది అనే అంశం కంటే ఎవరి అవకాశాలు దెబ్బతీస్తుంది అంటే అందరూ కాంగ్రెస్ కే ఎక్కువ నష్టం అని తేల్చారు. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి అధికార బిఆర్ఎస్ కు మేలు జరుగుతుంది అనే అంచనాలు ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు దేశం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ కు మేలు చేయనుంది. మరో వైపు ప్రస్తుత టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఒకప్పుడు తెలుగు దేశంలో ఉండటంతో చాలా మంది టీడీపీ క్యాడర్ ఇప్పటికే ఈ సారి రేవంత్ కు మద్దతుగా కాంగ్రెస్ కు ఓటు వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్నీ సోషల్ మీడియా వేదికగా కూడా చెపుతూ వస్తున్నారు. ఇప్పుడు తెలుగు దేశం పార్టీ తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించటంతో ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ కు ఉపయోగపడే అవకాశం ఉంది. కొద్ది రోజుల క్రితం తెలంగాణ టీడీపీ ప్రెసిడెంట్ కాసాని జ్ఞానేశ్వర్ ఇప్పటికే 95 మంది అభ్యర్థులతో తాము పోటీ కి తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. తాజాగా రాజమండ్రి జైలు లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు తో సమావేశం అయిన సమయంలో జ్ఞానేశ్వర్ కు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పోటీ నుంచి తప్పుకుందాం అని చంద్రబాబు స్పష్టం చేశారు.