కిడ్నాప్ డ్రామా ఆడిన ఫార్మసీ విద్యార్ధిని ఆత్మహత్య
ఒక తప్పు నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఆ అమ్మాయి సృష్టించిన కిడ్నాప్ డ్రామా చాలా మందికి చుక్కలు చూపించింది. చివరకు తాను కూడా అవమానభారంతో ప్రాణాలు వదిలింది. కొద్ది రోజుల క్రితం ఘట్ కేసర్ దగ్గర జరిగిన కిడ్నాప్ డ్రామా వ్యవహారం తెలంగాణలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. విచారణలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. చివరకు కిడ్నాప్ కథ అంతా డ్రామా అని తేల్చారు పోలీసులు. దీంతో ఆ యువతిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో మనస్తాపానికి గురైన యువతి బుధవారం ఆత్మహత్య చేసుకుంది.
నిద్రమాత్రలు మింగి ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్ళగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. అంతకు ముందు ఘట్ కేసర్ లో తనను నలుగురు వ్యక్తులు అపహరించి సామూహిక అత్యాచారం చేశారంటూ ఫిర్యాదు చేసింది. తొలుత అదే కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ తర్వాత అంతా తప్పు అని నిర్ధారించారు.