భూములు ఇవ్వటం తప్ప ..ప్రభుత్వం కట్టేది ఏంటి?!

తెలంగాణ లో రిటైర్ అయిన ఉద్యోగులకు చట్టబద్ధంగా ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వటానికి ప్రభుత్వ ఖజానా ఖాళీ అంటున్నారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన డీఏ లకు నిధులు లేవు. ఫీజు రీయింబర్సుమెంట్ బకాయిలు వేల కోట్ల రూపాయల్లో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ కింద పేదలకు వైద్యం అందించినందుకు హాస్పిటల్స్ కు ఇవ్వాల్సిన బకాయిలు కూడా వేల కోట్లలోనే ఉన్నాయి. ఇవి అన్నీ కుడా తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ..సీఎం రేవంత్ రెడ్డి సృష్టించిన సమస్యలు కావు. ఈ ప్రభుత్వానికి వారసత్వంగా పదేళ్ల బిఆర్ ఎస్ పాలన నుంచి వచ్చినవే...వీటిని పరిష్కరించటంలో కాంగ్రెస్ సర్కారు నానా తంటాలు పడుతోంది. చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద కాంట్రాక్టర్లకు కూడా చేసిన పనులకు బిల్లులు చెల్లించే పరిస్థితి కూడా లేదు. ఇవే కాదు తెలంగాణ లో ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి. కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీల్లో పరిష్కరించాల్సినవి కూడా ఎన్నో పెండింగ్ లో ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కెసిఆర్ ప్రభుత్వంలో ఉన్న అవినీతిని ఆపేస్తే చాలు తాము ఇచ్చిన హామీలు అన్నీ కూడా ఈజీ గా అమలు చేయవచ్చు అని రేవంత్ రెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే. కానీ అధికారంలోకి వచ్చి మరి కొద్ది రోజుల్లోనే రెండు సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నారు.
ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ పేరుతో న్యూయార్క్ నగరాన్ని తలపించే సిటీ కడతా ...ఎన్ని రోజులు సింగపూర్ , దుబాయ్, న్యూయార్క్ ల గురించి చెప్పుకుందాం అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆదివారం నాడు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ ఆథారిటీ భవనానికి శంఖుస్థాపన చేసిన తర్వాత నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తనకు పదేళ్లు సమయం ఇస్తే విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా భారత్ ఫ్యూచర్ సిటీ ని చూసి వచ్చామని చెప్పేలా డెవలప్ చేస్తామని ప్రకటించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు అయిన తర్వాత దగ్గర దగ్గర పదేళ్లు అధికారంలో ఉన్న కెసిఆర్ కూడా ఇదే తరహా మాటలు చెప్పారు. కరీంనగర్ ను లండన్ లా తీర్చిదిద్దుతా అని...ఓల్డ్ సిటీ ని ఇస్తాంబుల్ లాగా అభివృద్ధి చేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. పదేళ్లు పాలించిన కెసిఆర్ ఏమి చేశారో అందరికి తెలిసిందే. ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోతలు కూడా కెసిఆర్ ను మించిపోయేలా ఉన్నాయని కాంగ్రెస్ నేతలు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. అసలు రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ ఎలా కడతారు?. అక్కడ ఒకటి రెండు తప్ప కొత్తగా వచ్చే ప్రభుత్వ భవనాలు ఏమి ఉండవు. ప్రభుత్వ భూములను ఐటి తో పాటు ఇతర ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తే అక్కడ అవి ఆఫీస్ లు పెట్టుకోవటం తప్ప..రేవంత్ రెడ్డి నిర్మించే సిటీ ఏమి ఉంటుంది?.
ఎంపిక చేసిన వేల ఎకరాల్లో మౌలిక సదుపాయాలు కల్పించటం తప్ప ప్రభుత్వం అక్కడ కొత్తగా కట్టేది ఏమీ ఉండదు. కానీ సీఎం రేవంత్ రెడ్డి పదే పదే తాము ఒక సిటీ ని నిర్మించబోతున్నట్లు చెప్పుకుంటున్నారు. ఏ ప్రభుత్వం అయినా భారీ భారీ లక్ష్యాలు పెట్టుకోవటం తప్పేమి కాదు. అదే సమయంలో క్షేత్ర స్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితి ఏంటి...అసలు ఈ భారీ లక్ష్యాలను సాధించటానికి అనువైన వాతావరణం..వనరులు ఉన్నాయా అన్నది ఇక్కడ ఎంతో కీలకం. ఒక వైపు స్వయంగా ముఖ్యమంత్రే ఎక్కడా అప్పుపుట్టడం లేదు..పరిస్థితి దారుణంగా ఉంది అని చెప్పుకుంటూ మరో వైపు న్యూయార్క్, దుబాయ్, సింగపూర్ లను తలదన్నే నగరాన్ని నిర్మిస్తా అంటే ఇది ఎంత మేరకు ఆచరణ సాధ్యం. ప్రభుత్వం ఒక ప్లాన్డ్ సిటీ ని అభివృద్ధి చేయాలంటే కల్పించాల్సింది అక్కడ మౌలిక సదుపాయాలు మాత్రమే. ఏదో ఒక నగరం పేరు ప్రభుత్వ భూములను ఐటి తో పాటు ఇతర ప్రైవేట్ సంస్థలకు...కార్పొరేట్ కంపెనీలకు కేటాయించటమే. ఉమ్మడి రాష్ట్రం దగ్గర నుంచి రాష్ట్ర విభజన తర్వాత కూడా జరుగుతున్నది అదే. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి చేయబోతున్నది కూడా అదే నని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వెల్లడించారు.



