జానారెడ్డి బంధువుల కంపెనీతో రెండు ఒప్పందాలు

గ్రీన్ కో కంపెనీలతో నాలుగు ఒప్పందాలు
తెలంగాణ సర్కారు హైదరాబాద్ లోని ఫ్యూచర్ సిటీ వేదికగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ లో పెద్ద ఎత్తున ఒప్పందాలు చేసుకొంటోంది. ఇందులో ఎక్కువ మొత్తం ఒప్పందాలు విద్యుత్ రంగంలో కనిపిస్తున్నాయి. వీటితో పాటు ఇతర రంగాలకు చెందిన కంపెనీలు ఉన్నా కూడా ఈ రంగం వాటానే అధికంగా ఉంది అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే ఆస్తా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సోమవారం నాడు రెండు ఒప్పందాలు చేసుకుంది. ఇందులో ఒకటి పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ (పీఎస్ పీ). ఈ కంపెనీ 4650 కోట్ల రూపాయల పెట్టుబడితో నిజామాబాద్ జిల్లా మైలవరం గ్రామంలో 750 మెగావాట్ల సామర్థ్యంతో ఈ ప్రాజెక్ట్ నెలకొల్పబోతోంది. దీంతో పాటు ఇదే కంపెనీ 5600 కోట్ల రూపాయల పెట్టుబడితో సోలార్ పార్క్ లో 500 మెగావాట్ల క్యాప్టివ్ సోలార్ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో ఉంది. ఈ కంపెనీ కాంగ్రెస్ సీనియర్ నేత కె. జానారెడ్డి కి చెందిన వియ్యంకుడుతో పాటు అయన సన్నిహిత బంధువులదే. అంతే కాదు...ఈ ఆస్తా గ్రీన్ ఎనర్జీ ఏర్పాటు సమయంలో జానారెడ్డి తనయుడు కుందూరు రఘువీర్ బోర్డు డైరెక్టర్ గా కూడా ఉన్నారు. తర్వాత బోర్డు నుంచి తప్పుకున్నట్లు చెపుతున్నారు. ప్రస్తుతం బోర్డు లో ఉన్న కేశవ్ రెడ్డి మారెడ్డి మాజీ మంత్రి జానారెడ్డి వియ్యంకుడే అని కాంగ్రెస్ వర్గాలు చెపుతున్నాయి.
వీటితో పాటు ఏ ఎం గ్రీన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 8000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ-మెథనాల్ ప్రాజెక్ట్ ఏర్పాటు కు ఎంఓ యూ చేసుకుంది. ఇదే కంపెనీ పది వేల కోట్ల రుపాయల పెట్టుబడితో 2 జీ ఇథనాల్ ప్లాంట్ పెడుతుంది అని వెల్లడించారు. ఈ కంపెనీ మరెవరిదో కాదు....గ్రీన్ కో ఫౌండర్లు అయిన అనిల్ కుమార్ చలమల శెట్టి తదితరులదే. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే గ్రీన్ కో ఎనర్జీస్ ప్రవేట్ లిమిటెడ్ ములుగు జిల్లా ఇప్పగూడెం దగ్గర 24000 కోట్ల రూపాయల పెట్టుబడితో 3960 మెగావాట్ల సామర్ధ్యంతో కూడిన పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయబోతున్నట్లు ఒప్పందం చేసుకుంది. గ్రీన్ కో టిజీ 01 ఐఆర్ఈపీ ప్రైవేట్ లిమిటెడ్ ఆదిలాబాద్ జిల్లా జారీ గ్రామంలో 5800 కోట్ల రూపాయల పెట్టుబడితో రెండు పీఎస్ పీ ప్రాజెక్టులు ఏర్పాటు చేయటానికి ఒప్పందం చేసుకుంది.
అంటే మొత్తం నాలుగు కంపెనీల ద్వారా ఒక్క గ్రీన్ కో ప్రమోటర్లకు చెందిన కంపెనీలే 48000 కోట్ల రూపాయల పెట్టుబడులకు రేవంత్ రెడ్డి సర్కారు తో ఒప్పందం చేసుకున్నాయి. ఒక వైపు తెలంగాణ సర్కారు ఫార్ములా ఈ కార్ రేస్ లో గ్రీన్ కో కు చెందిన సంస్థలే బిఆర్ఎస్ పార్టీ కి క్విడ్ ప్రో కో కింద నిధులు అందచేశాయని ఆరోపిస్తూ ఇప్పుడు ఇదే గ్రూప్ కు చెందిన పలు సంస్థలతో ఏకంగా నాలుగు ఎంఓయూలు చేసుకున్నారు. ఈ ఒప్పందాలు చూస్తుంటే అసలు ఫార్ములా ఈ కార్ రేస్ విచారణ ...చర్యలు రాబోయే రోజుల్లో ఏ మేరకు ఉంటాయో అన్న అనుమానాలు తలెత్తుతున్నాయని ఆ పార్టీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఒప్పందాల్లో ఒకటి కాంగ్రెస్ పార్టీ కి చెందిన కీలక నేతకు చెందిన ఫ్యామిలీ కంపెనీ ఒప్పందాలు రెండు...మరో గ్రూప్ తో ఏకంగా నాలుగు ఒప్పందాలు చేసుకోవటం చర్చనీయాంశగా మారింది. ఈ ఒప్పందాలు అన్నిటి వెనక ఒక సిండికేట్ పని చేసింది అనే చర్చ కూడా అధికార వర్గాల్లో ఉంది. రాబోయే రోజుల్లో వీటికి సంబంధించిన ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.



