సిట్ కు కెసిఆర్ లేఖ

టెలిఫోన్ ట్యాపింగ్ కేసు లో సిట్ ముందు విచారణకు బిఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కెసిఆర్ గడువు కోరారు. జనవరి 30 సాయంత్రం మూడు గంటల నుంచి విచారణకు సిద్ధంగా ఉండాలి అంటూ సిట్ గురువారం నాడు హైదరాబాద్ లోని కెసిఆర్ నందినగర్ నివాసంలో నోటీసులు అందచేసిన సంగతి తెలిసిందే. కెసిఆర్ వయసు దృష్టా అయనకు విచారణ ఎక్కడ అనువుగా ఉంటుంది అంటే అక్కడే విచారణ చేస్తామని...అయితే ముందస్తుగా ఈ విషయం విచారణ అధికారికి తెలియచేయాలని నోటీసు లో పేర్కొన్నారు. ఈ నోటీసు లపై స్పందించిన కెసిఆర్ తనకు కొంత సమయం కావాలని కోరారు. దీనికి అయన మున్సిపల్ ఎన్నికల విషయాన్ని కారణంగా చూపారు. తాను ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో బిజీగా ఉన్నాను అని తెలిపారు. మరో తేదీని ఖరారు చేసి సమాచారం ఇస్తే విచారణకు సిద్ధంగా ఉంటానన్నారు.
సిఆర్పీసి సెక్షన్ 160 ప్రకారం ఇంటివద్దే విచారణ జరపాలని కేసీఆర్ అధికారులను కోరారు. 65 ఏళ్లు దాటిన వారిని పోలీస్ స్టేషన్‌కు పిలవకూడదని చట్టం లో ఉందన్న విషయాన్ని ప్రస్తావించిన కెసిఆర్ ...సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం ఎరవల్లి గ్రామంలో తన నివాసం అని, అక్కడికే వచ్చి విచారణ చేయాలని కోరారు. భవిష్యత్తు నోటీసులు ఈ నివాస చిరునామాకే పంపాలని తన సమాధానంలో తెలిపారు. మాజీ సీఎం గా..ప్రతిపక్ష నాయకుడిగా విచారణకు పూర్తి గా సహకరిస్తానని కెసిఆర్ తన లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే సిట్ అధికారులు టెలిఫోన్ ట్యాపింగ్ కేసు లో మాజీ మంత్రులు కేటీఆర్ తో పాటు హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావు లను విచారించిన సంగతి తెలిసిందే. కెసిఆర్ ను కూడా విచారిస్తే ఈ మొత్తం వ్యవహారం ఒక కొలిక్కి వచ్చినట్లు అవుతుంది అని అధికార వర్గాలు చెపుతున్నాయి.



