జీహెచ్ఎంసీలో వరద సాయం నిలిపివేత
జీహెచ్ఎంసీలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున వరద సాయాన్ని నిలిపివేయాల్సిందిగా ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలు ముగిసిన తర్వాత సాయం చేసుకోవచ్చని పేర్కొన్నారు. వరదసాయం కోసం దరఖాస్తుల స్వీకరణ, పంపిణీని నిలిపివేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. విశేషం ఏమిటంటే వరద సాయానికి ఎలాంటి అభ్యంతరం లేదని షెడ్యూల్ ప్రకటన సమయంలో ఎస్ఈసీ పార్ధసారధి ప్రకటించారు. దీంతో మంగళవారం నాడు కూడా పెద్ద ఎత్తున దరఖాస్తులు రావటం...నేరుగా వారి ఖాతాల్లో నగదు జమ అవటం జరిగిపోయాయి.
బుధవారం నాడు కూడా నగరంలోని పలు ఈ సేవా కేంద్రాల వద్ద వేల సంఖ్యలో ప్రజలు క్యూకట్టి దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నించారు. ఈ రద్దీ మరీ ఎక్కువ కావటంతో ఏకంగా సర్వర్ కూడా డౌన్ అయింది. కానీ అనూహ్యంగా ఎన్నికల కమిషన్ కోడ్ అమల్లోకి వచ్చిందని వరద సాయం నిలిపివేయాలని కోరటం విశేషం. ఒక్క రోజులోనే ఎస్ఈసీ నిర్ణయం మార్చుకోవటం చర్చనీయాంశంగా మారింది. తొలుత తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కెటీఆర్ దరఖాస్తు చేసుకుంటే అధికారులు పరిశీలించి సాయం అందజేస్తారని తెలిపారు. కానీ అలాంటి పరిశీలన ఏమీ లేకుండా తాజా దరఖాస్తుదారుల ఖాతాల్లో నగదు జమ అయిపోయింది.