తెలంగాణలో ఫీవర్ సర్వే
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్ సర్వే చేపట్టాలని సర్కారు నిర్ణయించింది. ఈ విషయాన్ని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. శుక్రవారం నుంచే ఈ సర్వే ప్రారంభం కానుందని మంత్రి హరీష్ రావు తెలిపారు. తొలుత హరీష్ రావు జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి..అనంతరం ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఫీవర్ సర్వే ద్వారా బాధితులను గుర్తించి వారికి మెడికల్ కిట్స్ అందజేయనున్నట్లు తెలిపారు.
గతంలోనూ ఫీవర్ సర్వే ద్వారా తెలంగాణ దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని మంత్రి తెలిపారు. అప్పుడు కూడా కిట్స్ అందజేసి ప్రజలను కాపాడుకోగలిగినట్లు తెలిపారు. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న తరుణంలో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సౌకర్యంతోపాటు అవసరమైన అన్ని సదుపాయాలు సమకూరుస్తున్నామన్నారు. రెండు కోట్ల టెస్టింగ్ కిట్లను..కోటి హోం ఐసోలేషన్ కిట్స్ ను సిద్ధం చేసుకున్నామని..సీఎం కెసీఆర్ ముందు చూపుతోనే ఇది జరిగిందని తెలిపారు.