Telugu Gateway
Telangana

బిఆర్ఎస్ కు...ఎమ్మెల్సీ పదవికి రాజీనామా

బిఆర్ఎస్ కు...ఎమ్మెల్సీ పదవికి రాజీనామా
X

బిఆర్ఎస్ లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కు రాజకీయంగా ఎక్కడ నుంచి అయినా సవాల్ వచ్చే అవకాశం ఉంది అంటే అది ఒక్క హరీష్ రావు నుంచే. ఎందుకంటే హరీష్ రావు కు అటు పార్టీలోనూ...తెలంగాణ అంతటా ఒక గుర్తింపు ఉంది. ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో కూడా హరీష్ రావు కు నాయకుడిగా పేరు ఉంది. పలు జిల్లాల్లోని నాయకులు అందరితో పరిచయం ఉన్న నేత హరీష్ రావు. తెర వెనక ఏమి జరిగిందో తెలియదు కానీ కొద్ది నెలల క్రితమే కెటిఆర్ కు నాయకత్వం అప్పగిస్తే స్వాగతిస్తాను..సహకరిస్తాను అని ఒక మీడియా సమావేశంలో హరీష్ రావు ప్రకటించారు. అంతకు ముందే అసలు కెసిఆర్ ఉన్నంత వరకు నాయకత్వ సమస్య అన్నది తలెత్తదు అంటూ చెప్పిన ఇదే హరీష్ రావు ఆ తర్వాత కొద్ది రోజులకే సడన్ గా కేటీఆర్ కు నాయకత్వం అప్పగిస్తే సహకరిస్తాను అని ప్రకటించారు. గత కొంత కాలంగా బిఆర్ఎస్ లో కలకలం రేపుతున్న కవిత తొలుత రాజకీయం అంటే ట్విట్టర్ లో ఏదో నాలుగు ట్వీట్లు చేయటం కాదు..క్షేత్ర స్థాయిలో పోరాటం చేయాలి అంటూ అన్న కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

సడన్ గా ఆమె ఇప్పుడు తన టార్గెట్ మొత్తాన్ని హరీష్ రావు...సంతోష్ రావు ల వైపు మార్చటంతోటి బిఆర్ఎస్ లో కేటీఆర్ కు ఆమె లైన్ మరింత క్లియర్ చేస్తున్నారు అనే చర్చ సాగుతోంది. బిఆర్ఎస్ లో అందరికి తెలుసు నెక్స్ట్ పగ్గాలు కేటీఆర్ చేతికే వెళతాయని. కానీ పార్టీ లో శక్తివంతం అయిన నాయకుడిగా ఉన్న హరీష్ రావు ను ఇప్పుడు అన్ని రకాలుగా దెబ్బకొట్టడానికి ..పార్టీ లో ఉన్నా కూడా హరీష్ రావు వైపు అందరూ అనుమానపు చూపులు చూసేలా కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలు ఉన్నాయనే చర్చ సాగుతోంది. వాస్తవానికి కవిత బుధవారం నాడు మీడియా సమావేశంలో చెప్పిన వాటిలో తొంబై శాతం పైగా అంశాలు ఎప్పటి నుంచో రాజకీయ, మీడియా వర్గాల్లో విస్తృత ప్రచారంలో ఉన్నవే. ఇవి అన్ని చూస్తుంటే ఇది అంతా ఒక పథకం ప్రకారం సాగుతోంది అనే అనుమానాలు బిఆర్ఎస్ నేతలే వ్యక్తం చేస్తున్నారు. కవిత ను బిఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేయటంతో ఆమె కూడా తన ఎమ్మెల్సీ పదవికి..పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో కేటీఆర్ కు డైరెక్ట్ గా ఫ్యామిలీ నుంచి ఎలాంటి పోటీ లేకుండా పోయింది. ఇప్పుడు ఉన్నది హరీష్ రావు ఒక్కరే. దీంతో ఒక ఎజెండా ప్రకారం హరీష్ రావు ఒక్కరే భయంకరమైన అవినీతిపరుడు..రాజకీయ కుట్రదారుడు అనే ముద్ర వేసి ఆయన్ను డ్యామేజ్ చేసే ప్రయత్నం సాగుతోంది అని బిఆర్ఎస్ నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కవిత బుధవారం నాడు మీడియా సమావేశం లో హరీష్ రావు, సంతోష్ రావు ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ అవుతుందా అని ప్రశ్నించారు. మరి కవిత, కెసిఆర్, కేటీఆర్ ఇంట్లో బంగారం లేదా అనే ప్రశ్నలు ఇప్పుడు ఆమెకు ఎదురవుతున్నాయి. సోషల్ మీడియా లో దీనిపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.

మరో వైపు బిఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో హైదరాబాద్ లో పెద్ద ఎత్తున సాగిన రియల్ ఎస్టేట్ దందాలు...ప్రభుత్వ భూములు...వివాదాస్పద భూములను రియల్ ఎస్టేట్ కంపెనీ లకు కట్టబెట్టి పెద్ద ఎత్తున లబ్ది పొందింది ఎవరో కవిత కు తెలియదా అని ఒక బిఆర్ఎస్ నాయకుడు సందేహం లేవనెత్తారు. అంతే కాకుండా హైదరాబాద్ లోని ఐటి కారిడార్ లో లక్ష చదరపు అడుగుల స్థలాలు బినామీ పేర్లతో ఎవరి పేర్ల మీద ఉన్నాయో కవిత కు ఎవరూ చెప్పలేదా అనే ప్రశ్నలు తెర మీదకు వస్తున్నాయి. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే బిఆర్ఎస్ నాయకులు అంతా కవిత చేసిన వ్యాఖ్యల వెనక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు..లేకపోతే మరొకరు ఉన్నారు అని చెపుతున్నారు తప్ప కవిత బుధవారం నాడు అంతకు ముందు హరీష్ రావు , సంతోష్ రావు లపై చేసిన అవినీతి ఆరోపణలను ఎవరూ గట్టిగా ఖండించే ప్రయత్నం చేయటం లేదు. దీంతో కూడా ఈ మొత్తం వ్యవహారంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.

Next Story
Share it