తెలంగాణ విమానాశ్రయాలను వేగవంతం చేయండి
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ ఢిల్లీలో వరసగా కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. శనివారం నాడు ఆయన కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అభివృద్ధి చేయతలపెట్టిన విమానాశ్రయాలకు త్వరగా అనుమతులు వచ్చేలా సహకరించాలని కోరారు. అదే సమయంలో ఢిల్లీలో టీఆర్‌ఎస్‌కు పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయించినందుకు ముఖ్యమంత్రి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం మినహా మిగతా విమానాశ్రయాల అభివృద్ధి కోసం భూమిని గుర్తించి, ప్రతిపాదనలను కేంద్రానికి పంపించినట్టు ముఖ్యమంత్రి తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం పెద్ద జిల్లాలోని బసంత్ నగర్ లో, వరంగల్ అర్భన్ జిల్లాలోని మామునూరు, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి , మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయాలను ప్రతిపాదించారు. విమానాశ్రయాలకు అనువైన ప్రాంతాలను గుర్తించటంతోపాటు దీనికి అవసరమైన అన్ని చట్టబద్ధమైన అనుమతులను సింగిల్ విండో విధానం కింద ఇచ్చేందుకు సహకరించాలని కోరారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మౌలికసదుపాయాలను అభివృద్ధి చేసి సొంత నిధులతో నాన్ షెడ్యూల్డ్ ఆపరేటర్స్ పర్మిట్ (ఎన్ఎస్ వోపీ) సర్వీసులు ప్రారంభిస్తుందని తెలిపారు.