ఈడీకి సమాచారం అంతా ఇచ్చాం

ధిక్కరణ పిటీషన్ కొట్టేయండి..హైకోర్టును కోరిన ఎక్సైజ్ శాఖ
టాలీవుడ్ డ్రగ్స్ కేసు వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఈ కేసుకు సంబంధించిన కీలక సాక్ష్యాలను తమకు ఇవ్వటంలేదని ఎన్ పోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ) హైకోర్టులో ధిక్కార పిటీషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ పిటీషన్ పై ఎక్సైజ్ శాఖ కౌంటర్ దాఖలు చేసింది. ఈడీకి కావాల్సిన సమాచారం మొత్తం అందజేస్తామని..పని ఒత్తిడి వల్ల కొంత జాప్యం జరిగింది తప్ప..కోర్టు ఆదేశాలను ధిక్కరించాలనే యోచన తమకు ఏ మాత్రం లేదని..జాప్యానికి బేషరతుగా క్షమాపణలు చెబుతున్నట్లు అందులో పేర్కొంది. కెల్విన్ కేసులో వాట్సప్ స్క్రీన్ షాట్లను కూడా ఈడీకి అందజేశామని..అదే సమయంలో 828 పేజీల వివరాలు ఈడీకి సమర్పించినట్లు తెలిపారు.
దర్యాప్తు అధికారులు నిందితుల కాల్ డేటా సేకరించలేదని..అయితే కెల్విన్ కేసులో సేకరించిన 12 మంది కాల్ డేటాను కూడా అందజేసినట్లు తెలిపారు. 12 మందిని విచారణ చేసిన సమయంలో తీసిన వీడియో రికార్డింగ్ డేటా కూడా ఈడీకి ఇచ్చేశామన్నారు. ఈ అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకుని ధిక్కార పిటీషన్ ను కొట్టివేయాలని కోరారు. అయితే తాము దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటీషన్ పై వాదనలు విన్పించేందుకు సమయం కావాలని ఈడీ కోరగా..కోర్టు ఈ కేసును వేసవి సెలవుల తర్వాత చేపట్టాలని నిర్ణయించింది.