Telugu Gateway
Telangana

బిఆర్ఎస్ లో మల్లారెడ్డి కలకలం

బిఆర్ఎస్ లో మల్లారెడ్డి కలకలం
X

బిఆర్ఎస్ లో ఒకటే కలకలం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఎమ్మెల్యేలు కలిసినా..మరో కాంగ్రెస్ నేతను కలిసినా వెంటనే పార్టీ మారుతున్నారు అనే ప్రచారం ఊపు అందుకుంటోంది. ఎందుకంటే పరిస్థితులు ఇప్పుడు అలా తయారు అయ్యాయి. కొద్ది రోజుల క్రితం వరకూ మల్కాజిగిరి లోక్ సభ సీటు తన కొడుక్కే అంటూ ప్రచారం చేసుకున్న బిఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లా రెడ్డి తన అల్లుడి కాలేజీల కూల్చివేతకు ప్రభుత్వం రంగంలోకి దిగటంతో మల్కాజిగిరి లోక్ సభ సీటు విషయంలో వెనక్కు తగ్గిన విషయం తెలిసిందే. మల్లా రెడ్డి తాజాగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీ కె శివ కుమార్ తో భేటీ కావటం మరో సారి రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. అంతే కాదు మల్లా రెడ్డి, అయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి పార్టీ మారుతున్నారు అని ప్రచారం మరో సారి ఊపుఅందుకుంది. ఒక బిజినెస్ పని మీద మాత్రమే తాము డీ కె శివకుమార్ తో భేటీ అయినట్లు మల్లా రెడ్డి వివరణ ఇచ్చారు. ఈ భేటీలో ఎలాంటి రాజకీయ కోణం లేదు అన్నారు.

వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయను అని..ఈ ఐదేళ్లు బిఆర్ఎస్ లోనే ఉంటానని ప్రకటించారు. రాబోయే రోజుల్లో ఏమి జరుగుతుందో చూడాలి. డీ కె శివ కుమార్ తో భేటీ తర్వాత వీళ్ళు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అపాయింట్ మెంట్ కోరినట్లు సోషల్ మీడియా లో వార్తలు హల్చల్ చేశాయి. మరో వైపు ప్రతిపక్ష బిఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున అధికార కాంగ్రెస్ పార్టీ లో చేరతారు అనే ప్రచారం గత కొంత కాలంగా సాగుతోంది. అయితే ఇది లోక్ సభ ఎన్నికల తర్వాత ఉంటుందా..లేక ఎన్నికల ముందే ఉంటుందా అన్న విషయంలో మాత్రం స్పష్టత లేదు. తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ ప్రభుత్వం ఉండేది ఆరు నెలలే అని కొంత మంది..ఏడాదే అని మరికొంత మంది బిఆర్ఎస్ నేతలు ప్రకటనలు చేస్తూ ఉన్నారు. ఈ ప్రకటనలపై సీఎం రేవంత్ రెడ్డి పలు మార్లు బహిరంగంగా తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఇది అంతా ఒక ప్లాన్ ప్రకారం సాగుతుంది అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో ఉంది.

Next Story
Share it