పార్టీ అధ్యక్ష పదవి దక్కనివ్వని వాళ్ళు...ఇతర కీలక పదవులు రానిస్తారా?!

ఎన్నో ఆశలతో బీజేపీ లోకి అడుగుపెట్టిన మాజీ మంత్రి, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కు ఇప్పుడు ఆ పార్టీ లో పెద్ద ఎత్తున ఉక్కపోత ఎదురవుతోంది. వాస్తవానికి ఈటల రాజేందర్ కు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తారు అని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తెలంగాణ రాజకీయాలపై పూర్తి అవగాహన ఉన్న ఆయనకు ఈ పదవి ఇస్తే వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో బీజేపీ కి గెలుపునకు ఇది ఉపయోగపడుతుంది అని ఎక్కువ మంది నమ్మారు. కానీ బిఆర్ఎస్ నుంచి వచ్చిన ఈటల రాజేందర్ కు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలనే అధిష్ఠానం ఆలోచనలు తెలంగాణలోని సీనియర్ బీజేపీ నేతలకు ఏ మాత్రం రుచించలేదు. అందుకే వాళ్ళు తెర వెనక ప్రయత్నాలు చేసి ఆయనకు పదవి రాకుండా చేయటంలో విజయం సాధించారు. దీంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రాంచందర్ రావు కు దక్కింది. ఇది ఈటల రాజేందర్ కు ఊహించని పరిణామం. అయినా సరే అయినా ఎక్కడా కూడా బయటపడి తన అసంతృప్తిని వ్యక్తం చేయలేదు.
కానీ గత కొన్ని రోజులుగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈటల గతంలో ప్రాతినిధ్యం వహించిన హుజురాబాద్ నియోజకవర్గం కేంద్రంగా రాజకీయం ప్రారంభించారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తన మనుషులకు సీట్లు ఇప్పించుకునే ప్రయత్నం చేసే క్రమంలో గతంలో కొంత మంది తనకు...బీజేపీ కి ఇక్కడ తక్కువ మెజారిటీ వచ్చేలా ప్రయత్నాలు చేశారు అని అలా చేసిన వాళ్లకు సీట్లు ఇద్దామా అని ప్రశ్నించారు. పేరు పెట్టకపోయినా ఇది ఈటల రాజేందర్ ను టార్గెట్ చేసి మాట్లాడిన మాటలే అన్న విషయం ఎవరికైనా తెలిసిపోవుతుంది. తాజా పరిణామాలతో హుజురాబాద్ లో ఈటల గ్రూప్ కకావికలం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. కొంత మంది ఇప్పటికే రాజీనామాల బాట కూడా పట్టారు. ఈ తరుణంలో ఈటల రాజేందర్ శనివారం నాడు శామీర్ పేట లోని తన నివాసానికి తరలివచ్చిన హుజురాబాద్ కార్యకర్తల ను ఉద్దేశించిన మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
నాకు స్ట్రెయిట్ ఫైట్ మాత్రమే వచ్చు. స్ట్రీట్ ఫైట్ రాదు. కానీ కడుపులో కత్తులు పెట్టుకొనే వారితో పోరాటం చేయలేమని వ్యాఖ్యానించారు. ఎంత వరకు ఓపిక పట్టాలో తెలుసు. సోషల్ మీడియా లో కొంత మంది చేస్తున్న రచ్చ అంతా పై వాళ్లకు పంపే ఆలోచన చేస్తున్నా. తనకు ఎవరి దయాదాక్షిణ్యాలు అవసరం లేదు. ఒక్క రాజకీయాల్లోనే కాదు ప్రతిదాంట్లోనూ కోవర్ట్ లు ఉంటారు. వాళ్ళ గురించి ఆలోచించవద్దు. హుజురాబాద్ వస్తా. మీ వెంటే ఉంటా. స్థానిక ఎన్నికల్లో మిమ్మల్ని గెలిపించుకుంటా అని ఈటల రాజేందర్ కార్యకర్తలకు భరోసా కలిపించే ప్రయత్నం చేశారు. రాజకీయాల్లో అవమానాలు, అవహేళనలను దాటి తాను ముందుకు వచ్చానని చెప్పారు. అప్పుడు కేసీఆర్ తన విషయంలో చేసింది అదేనని గుర్తుచేశారు. అయినా హుజురాబాద్ బిడ్డలు తనను కాపాడుకున్నారని తెలిపారు . తాను అలాగే వారిని కాపాడుకుంటానని మాటిచ్చారు. దక్షిణ భారతదేశంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించే సమయంలో ప్రధాని మోడీ మొదటగా తన నియోజకవర్గానికి నేరుగా సమావేశం పెట్టారని గుర్తుచేశారు. శామీర్ పేట భారతీయ జనతా పార్టీ అడ్డా. నేను ఇక్కడ బీజేపీ ఎంపీని. పార్టీ లకు ఊపిరి పొసే అడ్డా ఇది..నాయకులకు స్ఫూర్తినిచ్చే అడ్డా. రేపటి గెలుపుకు సంకేతం ఇచ్చే అడ్డా. దీన్ని పట్టుకుని వాడెవడో సైకోనా ..శాడిస్టా, మనిషా, పశువా. వాడు ఏ పార్టీ లో ఉన్నాడు. ఎవరి అండతో దైర్యం చేస్తున్నాడు. బీ కేర్ ఫుల్ కొడకా ..బీ కేర్ ఫుల్ అంటూ ఘాటు వార్నింగ్ ఇచ్చారు ఈటల రాజేందర్. ఆయన పేరు పెట్టి మాట్లాడకపోయినా కూడా ఇవి బండి సంజయ్ ని టార్గెట్ గా చేసుకుని అన్న మాటలే అన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. గత కొంత కాలంగా చోటు చేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే ఈటల రాజేందర్ ను బీజేపీ లో కీలక స్థానాల్లోకి ఎంత మేరకు ఎదగనిస్తారు అన్నది అనుమానమే అన్న భయం ఆయన వర్గం నేతల్లో ఉంది. పార్టీ అధ్యక్ష పదవే రాకుండా అడ్డుకున్న వాళ్ళు ఇతర పదవులు మాత్రం రానిస్తారా అని ఒక సీనియర్ నేత ప్రశ్నించారు. మరి బీజేపీ లో ఈటల రాజేందర్ ఈ ఉక్కబోతలు ఇప్పటివరకు భరిస్తారో చూడాలి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికీ ఎన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచిచూడాల్సిందే.



