Top
Telugu Gateway

కరోనా సెకండ్ వేవ్ లో 95 శాతం మందికి ఇంట్లోనే చికిత్స

కరోనా సెకండ్ వేవ్ లో 95 శాతం మందికి ఇంట్లోనే చికిత్స
X

కరోనా మొదటి వేవ్ కు..రెండవ వేవ్ కు మద్య చాలా తేడా ఉందని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. సెకండ్ వేవ్ లో 95 శాతం మంది బాధితులకు ఇంట్లోనే చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. అదే మొదటి వేవ్ లో 20 శాతం మేర ఆస్పత్రిలో చేరేవారన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో చేపట్టాల్సిన చర్యలపై ఈటెల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 47 వేల పడకల్లో సగానికి పైగా కరోనాకే వాడుతున్నామని తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయటానికి , ఈ వైరస్ సోకిన వారికి చికిత్స అందించడానికి, వైరస్ సోకిన వారు మరణించకుండా ఉండేందుకు పూర్తి అప్రమత్తతో పని చేయాలని ఈటల రాజేందర్ సూచించారు. ప్రధానంగా గ్రామస్థాయిలో ఉన్న ఆశ వర్కర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర స్థాయిలో ఉన్న డాక్టర్లు కరోనా వైరస్ రోగులను వెంటనే గుర్తించడం ద్వారా ఈ వైరస్ వ్యాప్తిని సమర్థవంతంగా అరికట్టాలని జిల్లా వైద్య అధికారులతో మంత్రి నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో అన్నారు. నిరంతర బిజీగా వైద్య సేవలు అందిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్ర స్థాయి డాక్టర్లకు సిబ్బందికి మంత్రి అభినందనలు తెలిపారు.

మరికొద్ది రోజులు ఇదే యుద్ధ వాతావరణంలో పని చేయాలని పిలుపునిచ్చారు. ఆశా వర్కర్లకు, ప్రాథమిక ఆరోగ్య స్థాయి డాక్టర్లకు, సిబ్బందికి అవసరమైన పర్సనల్ కేర్ ఎక్విప్మెంట్ లు అన్ని సకాలంలో అందేలా చూడాలని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాస్ ను మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా పరీక్షలు జరుగుతున్న అన్ని కేంద్రాల్లో టెస్ట్ కిట్లు అందుబాటులో ఉండేలా చూడాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. వైద్యం అందిస్తున్న హాస్పిటల్స్ లో ఆక్సిజన్, రెమిడెవిసర్ ఇంజెక్షన్ల కొరత లేకుండా చూడాలని కోరారు. సాధ్యమైనంతవరకు ఎక్కువ మంది పేషెంట్లను హోమ్ ఐసోలేషన్ లోనే ఉంచే విధంగా కౌన్సిలింగ్ చేయాలని తెలిపారు. సీరియస్ అయిన పేషెంట్లకు ఆసుపత్రికి తరలించేందుకు అవసరమైన అంబులెన్సులు సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు.

Next Story
Share it