ఈటెల ఒంటరి వాడు కాదు
మాజీ మంత్రి ఈటెల రాజేందర్ తెలంగాణ సర్కారు తీరుపై మండిపడ్డారు. తన నియోజకవర్గంలో వందల మంది ఇంటిలెజెన్స్, ఇతర పోలీస్ అధికారులను రంగంలోకి దింపారని ఆరోపించారు. సొంత పార్టీ ప్రజాప్రతినిధులను అంగట్లో సరుకులుగా వెలకట్టి కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు. కుల సంఘాల నాయకులను సిద్దిపేటలోని రంగనాయకసాగర్‌కు పట్టుకుపోయి అడిగిందే తడవుగా డబ్బులిస్తున్నారన్నారు. ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రలోభాలతోపాటు దొంగ ఓట్ల నమోదుకు శ్రీకారం చుట్టారన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తానని ఈటెల రాజేందర్ ప్రకటించారు.
కమలాపూర్ మండలంలోని బత్తినివాని పల్లె నుంచి ప్రారంభించి, 350 నుంచి 400 కిలోమీటర్లు చేస్తానని చెప్పారు. దీనిపై మరో మూడు రోజుల్లో వివరాలు వెల్లడిస్తానని తెలిపారు. శనివారం హుజూరాబాద్‌లోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. హుజూరాబాద్ చైర్‌పర్సన్ ఇంట్లోనే 34 ఓట్లు ఉన్నాయని తెలిపారు. టీఆర్‌ఎస్‌కు ఓటు వేయకుంటే పథకాలు రావని బెదిరిస్తున్నారని.. పథకాలను ఆపడం ఎవరి తాత జాగీరు కాదన్నారు. ఈటల ఒంటరి వాడు కాదని, తన వెంట ఉద్యమకారులు, సంఘాలు, ప్రజలు ఉన్నారని స్పష్టం చేశారు.