మొత్తం క్యాబినెట్ లో ఆయనదే ఫస్ట్ ప్లేస్ !

ఒకప్పుడు రాజకీయ నాయకులు మంచి పేరు తెచ్చుకోవటం కోసం తపనపడేవారు. కానీ ఇప్పటి రాజకీయ నాయకుల ట్రెండ్ మారింది. ఎలాంటి పేరు వచ్చినా సరే తమ కంటే ముందు ఉన్న వాళ్ళ కంటే తాము ఎక్కువ సంపాదించాం అనే పేరు తెచ్చుకోవటం కోసమే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే టార్గెట్ గా పెట్టుకుని పని చేస్తున్నారు కూడా . పేరు ఎలా ఉన్నా తమ దగ్గర ప్రత్యర్థుల కంటే ఎక్కువ వనరులు ఉంటే చాలు రాజకీయం ఎలాగైనా చేయవచ్చు అనే ఆలోచనే ఇప్పుడు ఎక్కువ మంది నేతల్లో కనిపిస్తోంది. ఈ విషయంలో ఏ పార్టీ కి మినహాయింపు లేదు అని చెప్పొచ్చు. కాకపోతే కొంత మంది అక్రమ సంపాదన పైకి కనిపిస్తుంది...మరి కొంత మంది ఏ మాత్రం కనిపించకుండా జాగ్రత్త పడతారు. ఈ విషయంలో రాజకీయ నాయకుల దగ్గర ఉన్న స్కిల్ పారిశ్రామికవేత్తల దగ్గర కూడా ఉండదు అనే చెప్పవచ్చు.
పదేళ్ల పోరాటం తర్వాత తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దక్కిన అధికారాన్ని వీళ్ళు సుస్థిరం చేసుకోవటం కంటే ఇప్పుడే అందినంత సంపాదించుకోవాలి అన్న ధోరణితో పని చేస్తున్నారు అనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. రేవంత్ రెడ్డి సర్కారులో కొంత మంది మంత్రులపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. చాలా మంది పై ఆరోపణలు ఉన్నా కూడా ఆయన ఈ జాబితాలో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు ఉన్న మంత్రుల్లో ఇద్దరు ఒకే జిల్లాకు చెందిన వాళ్ళు కావటం మరో విశేషం. ఇక అసలు విషయం ఏమిటి అంటే అవినీతి ఆరోపణల్లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న మంత్రి దుబాయ్ రియల్ ఎస్టేట్ లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టినట్లు కాంగ్రెస్ వర్గాలు చెపుతున్నాయి. వసూళ్ల బాధ్యత మంత్రిది అయితే...వీటి నిర్వహణ మొత్తం ఆ మంత్రి భార్యదే అని చెప్పుతున్నారు.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టడం కంటే దుబాయ్ రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టడం అత్యుత్తమం అని డిసైడ్ అయి గత కొంత కాలంగా ఆమె ఇదే పనిలో ఉన్నారు. ఇప్పటికే ఆ మంత్రి భార్య పలు మార్లు దుబాయ్ సందర్శించి దీనికి సంబంధించి ఒప్పందాలు కూడా చేసుకున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆమె కు తెలియకుండా ఆ మంత్రి చూసే శాఖల్లో కీలక నియామకాలు కూడా ఏవీ ముందుకు సాగవని సచివాలయ వర్గాల్లో కూడా విస్తృతంగా ప్రచారంలో ఉంది. దుబాయ్ లో పెట్టుబడి పెట్టిన తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులపై ఈడీ దృష్టి సారించింది అని తాజాగా మీడియా లో వార్తలు రావటంతో ఇప్పుడు ఆ మంత్రి ఫ్యామిలీ టెన్షన్ పీక్ చేరింది అని చెపుతున్నారు. దుబాయ్ రియల్ ఎస్టేట్ లో పెట్టుబడుల కోసం ఆమె ఒక టీం ను ఏర్పాటు చేస్తుకున్నట్లు చెపుతున్నారు. తెలంగాణా సర్కారులో ఈ మంత్రి ఒక్కరే అవినీతి పరుడు అని చెప్పటం కాదు కానీ..ఎప్పుడైనా ఫస్ట్ ప్లేస్ లో ఉన్న వాళ్ళకే కదా ఎక్కువ గుర్తింపు వచ్చేది.



