Telugu Gateway
Telangana

టాలీవుడ్ డ్రగ్స్ కేసు..రకుల్ ప్రీత్ సింగ్ కు ఈ డీ నోటీసులు

టాలీవుడ్ డ్రగ్స్ కేసు..రకుల్ ప్రీత్ సింగ్ కు ఈ డీ నోటీసులు
X

తెలంగాణ డ్రగ్స్ కేసు లో కీలక పరిణామం. కొంత కాలం పాటు టాలీవుడ్ ని కుదిపేసిన డ్రగ్స్ కేసు లో ఎన్‌‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈ డీ) తాజాగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు నోటీసులు ఇచ్చింది. డిసెంబర్ 19 న రకుల్ విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు బిఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కి కూడా నోటీసులు ఇచ్చారు. అయితే ఆయనకు ఇచ్చిన నోటీసులు డ్రగ్స్ కేసు కు సంబదించినవా లేక ఆర్థిక లావాదేవీల అంశానికి సంబదించినవా అన్న విషయం తెలియాల్సి ఉంది. ఈడీ నోటీసులపై ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి స్పందించారు. ఈడీ నోటీసులు అందాయని తెలిపారు. తన వ్యాపారాలు, కంపెనీలకు సంబంధించిన వివరాలు అడిగారని చెప్పారు. 19న ఈడీ విచారణకు హాజరవుతానని చెప్పారు. తెలంగాణ లో ఎమ్మెల్యే ల కొనుగోలు కేసు తెరపైకి వచ్చాక బెంగళూరు డ్రగ్స్ కేసు ను మళ్ళీ తెరిపిస్తామని తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ బండి సంజయ్ పదే పదే ప్రకటించారు. దీంతో ఈ నోటీసు అంశంపై ఆసక్తి నెలకొని ఉంది. 2021 ఫిబ్రవరిలో కర్ణాటక రాజధాని బెంగళూరులో శంకర గౌడ ఇచ్చిన పార్టీకి పలువురు ఎమ్మెల్యేలు, వ్యాపారులు హాజరయ్యారు. రియల్టర్ సందీప్ రెడ్డి, హీరో తనీష్ హాజరయ్యారు.

ఆ పార్టీలో 4 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ ఉపయోగించారని పోలీసులకు సమాచారం అందింది. ఈ పార్టీకి సంబంధించి ఇద్దరు నైజీరియన్లను ఫిబ్రవరి 26న కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన డ్రగ్స్‌తో పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధాలున్నాయని బెంగళూరు పోలీసులు అనుమానిస్తున్నారు. భారీగా నగదు చేతులు మారిన నేపథ్యంలో కేసును ఈడీకి అప్పగించారు. ఈ నేపథ్యంలోనే రోహిత్ రెడ్డికి నోటీసులు అందినట్లు భావిస్తున్నారు. మొత్తం మీద ఒక్కసారిగా మళ్ళీ రకుల్ ప్రీత్ సింగ్, పైలట్ రోహిత్ రెడ్డి కి ఈ డీ నోటీసు లు రావటంతో రాజకీయం మరింత వేడెక్కటం ఖాయంగా కనిపిస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్ కు తెలంగాణ ప్రభుత్వంలోని కీలక నేతతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ఎప్పటినుంచో ప్రచారం ఉన్న విషయం తెలిసిందే. ఈ కోణంలో కూడా ఏమైనా విచారణ చేస్తారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

Next Story
Share it