మందుల కంపెనీ డైరెక్టర్ మద్యం వ్యాపారంలోకి ఎందుకొచ్చారో?!
ఆరబిందో ఫార్మా.. తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్ కంపెనీ. దేశంలోని ప్రముఖ ఫార్మా కంపెనీల్లో ఇది కూడా ఒకటి. ఈ గ్రూప్ ఫార్మా తో పాటు ఇటీవల కాలంలో రియల్ ఎస్టేట్ రంగంలో కూడా భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతోంది. మొత్తం మీద ఆరోబిందో ఫార్మా ప్రధాన వ్యాపారం మందుల తయారీ. అంటే ప్రజలకు వచ్చిన జబ్బులను తగ్గించే మందులు తయారు చేస్తుంది ఈ కంపెనీ. ఇంతవరకు బాగానే ఉంది. విచిత్రం ఏమిటి అంటే ఆరోగ్యాన్ని బాగు చేసే మందుల తయారీ కంపెనీలో అయన ప్రమోటర్ డైరెక్టర్. ఇప్పుడు ఢిల్లీ మద్యం విధానం స్కాం తో పాటు మనీ లాండరింగ్ కేసు లో ఆయన్ను గురువారం నాడు ఈడీ అరెస్ట్ చేసింది. శరత్ చంద్ర రెడ్డి తో పాటు మరో మద్యం వ్యాపారి వినయ్ బాబు ను కూడా అరెస్ట్ చేశారు. వీరిద్దరికి కోట్ల రూపాయల విలువ చేసే మద్యం వ్యాపారం ఉందని...ఢిల్లీ ప్రభుత్వం తెచ్చిన పాలసీ కి అనుగుణంగా శరత్ చంద్ర రెడ్డి ఈఎండిలు కట్టినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల పారిశ్రామిక వర్గాల్లో కలకలం రేపుతోంది. ఇంత పెద్ద గ్రూప్..ప్రతిష్టాత్మక కంపెనీలు పెట్టుకొని మద్యం వ్యాపారంలోకి ఎందుకు వెళ్లారు...ఎవరికోసం ఇది అంతా చేశారు అన్నది ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది. మద్యం వ్యాపారం చేయకూడదు అని ఏమి లేదు. ఎవరు ఈ వ్యాపారమైనా చేసుకోవచ్చు. అయితే ఇంత పెద్ద గ్రూప్ ఇందులో ఎందుకు భాగస్వామి అయింది అన్నది సహజంగా చర్చకు వస్తుంది . ఆరబిందో ఫార్మా హోల్ టైం డైరెక్టర్ అరెస్ట్ వార్తను కంపెనీ స్టాక్ మార్కెట్ కు సమాచారం ఇచ్చాక ఈ కంపెనీ షేర్లు భారీ ఎత్తున పతనం అయ్యాయి. ఒక దశలో 77 రూపాయల నష్టం తో 464 రూపాయల కనిష్ట స్థాయికి తగ్గింది.శరత్ చంద్ర రెడ్డి కి కంపెనీ రోజువారీ కార్యక్రమాలతో ఎలాంటి సంబంధం లేదని మరో వివరణ ఇచ్చిన షేర్ పతనం ఆగలేదు.