హుజూరాబాద్ లో దళితబంధుకు ఈసీ బ్రేక్
కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి కెసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన దళితబంధు స్కీమ్ ను హుజూరాబాద్ లో నిలిపివేయాలని ఈసీ ఆదేశించింది. రాష్ట్రంలోని ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో కొంత మందికి మాత్రమే అమలు చేస్తున్న దళితబంధు స్కీమ్ ను ఒక్క హుజూరాబాద్ లో మాత్రం పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు 2000 కోట్ల రూపాయలు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఇది కేవలం ఉప ఎన్నిక కోసమే అన్న విమర్శలు వెల్లువెత్తాయి. తొలుత అవును..రాజకీయ ప్రయోజనాల కోసమే చేస్తాం..అందులో తప్పేమి ఉంది అంటూ ప్రశ్నించిన కెసీఆర్..ఆ తర్వాత ఇది ఎప్పటి నుంచో ఉన్న ఆలోచన అని..కరోనా కారణంగా ఆలశ్యంఅయింది తప్ప మరొకటి కాదని అన్నారు.
హుజూరాబాద్ ఉప ఎన్నిక తెరపైకి వచ్చిన తర్వాతే దళితబంధు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. కుటుంబానికి పది లక్షల రూపాయల ఆర్ధిక ప్రయోజనం కల్పించటం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని టీఆర్ఎస్ చూస్తోందని పార్టీలు అన్నీ విమర్శలు గుప్పించాయి. తాజాగా ఈసీ నిర్ణయంతో ఈ వ్యవహారం మరింత వేడెక్కటం ఖాయంగా కన్పిస్తోంది. దీనిపై అధికార టీఆర్ఎస్ ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే. నేరుగా లబ్దిచేకూర్చే ఈ పథకాన్ని అక్టోబర్ 30 వరకూ నిలిపివేయాలని..దీనికి సంబంధించిన నివేదికను మంగళవారం మధ్యాహ్నం వరకూ ఈసీకి సమర్పించాలని ఆదేశించారు.