గజ్వేల్ లో సీఎం కెసీఆర్ పై పోటీచేస్తా..ఈటెల సంచలన ప్రకటన
బిజెపి ఎమ్మెల్యే, సీనియర్ నేత ఈటెల రాజేందర్ సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను సీఎం కెసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నుంచి బరిలోకి దిగనున్నట్లు వెల్లడించారు. పశ్చిమ బెంగాల్ లో అక్కడ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని సువేందు అధికారి ఓడించినట్లు..ఇక్కడ కూడా సీఎం కెసీఆర్ ను గజ్వేల్ లో ఓడించాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీచేసేందుకు ఇప్పటి నుంచే గజ్వేల్ లో సీరియస్ గా పనిచేస్తున్నట్లు ఈటెల తెలిపారు. ఆయన శనివారం నాడు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగానే ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పోడుభూముల వివాదం త్వరగా పరిష్కరించాలని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం బ్రోకర్గా మారిందని దుయ్యబట్టారు. ప్రభుత్వం వేల ఎకరాల భూమిని గుంజుకుని అమ్మకుంటుందని ఆరోపించారు.
వారసత్వంగా వచ్చిన భూములను కూడా లాక్కుంటున్నారని దుయ్యబట్టారు. దళితుల కళ్లల్లో మట్టికొడుతున్నారని మండిపడ్డారు. లక్షల అసైన్డ్ భూములు లాక్కుని రియల్ ఎస్టేట్ చేస్తున్నారని ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. స్వయంగా కెసీఆర్ అసెంబ్లీలో పలుమార్లు పోడు భూముల సమస్యను పరిష్కరిస్తానని..అందుకు మంత్రులు...ఎమ్మెల్యేలను కూడా వెంట బెట్టుకుని వెళతానని ప్రకటించారన్నారు. కానీ ఇప్పటి వరకూ సమస్య పరిష్కారం కాలేదన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల వేల కోట్ల రూపాయల భూములపై కన్నేసి ధరణిని తీసుకొచ్చారని ఆరోపించారు. గ్రామ స్థాయిలోనే సమస్యలు పరిష్కరించాలి కానీ..మళ్లీ దరఖాస్తులు తీసుకోవటం సరికాదన్నారు.