కెసీఆర్ చిల్లర రాజకీయాలు
ముఖ్యమంత్రి కెసీఆర్ పై మాజీ మంత్రి ఈటెల రాజేందర్ తీవ్ర విమర్శలు చేశారు. తనను ఓడగొట్టే దమ్ములేక కేసీఆర్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ''నా రాజీనామా తర్వాతనే కేసీఆర్ దళితులకు గౌరవం ఇస్తుండు. దళిత బిడ్డలను ఏసీ బస్సుల్లో ఎస్కార్ట్ పెట్టి ప్రగతిభవన్‌కు తీసుకువెళ్లిండు. అర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌ను నిర్దాక్షిణ్యంగా బయటకు పంపించారు. రాజకీయ వ్యవస్థను కేసీఆర్ బోన్‌లో నిలబెట్టాడు'' అని ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. 2023లో తెలంగాణాలో బిజెపి అధికారంలోకి రావటం ఖాయమన్నారు. ఇదిలా ఉంటే వాట్సప్ చాటింగ్ వివాదానికి సంబంధించి బిజెపి, టీఆర్ఎస్ వర్గాల మధ్య గురువారం నాడుఘర్షణ జరిగింది. ఈటెల బావమరిది వాట్సప్ చాటింగ్ లో దళితులను అవమానించేలా వ్యాఖ్యానించారనే ఆరోపణలు రాగా..ఇది అంతా ఫేక్ అని..అధికార టీఆర్ఎస్ కుట్ర అంటూ బిజెపి విమర్శిస్తోంది. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.
హుజూరాబాద్ ఉప ఎన్నికలో దళితుల ఓట్లు కీలకం కావటంతో రాజకీయం అంతా వారి చుట్టూనే తిరుగుతోంది. వారిని ఆకట్టుకునేందుకు అధికార టీఆర్ఎస్ దళిత బంధు పథకం పైలట్ ప్రాజెక్టును తెరపైకి తీసుకురాగా..తమ వల్లే ఇది వచ్చిందని..హుజూరాబాద్ తో పాటు రాష్ట్రమంతటా కూడా ఇక్కడ అమలు చేసే పథకాలు అన్నీ అమలు చేయాలని కోరుతున్నారు. ఈటెల తన డిమాండ్ల ద్వారా అధికార పార్టీకి చెందిన మంత్రులు..ఎమ్మెల్యేలను ఒకింత ఇరకాటంలోకి నెడుతున్నారనే చెప్పొచ్చు. ఎన్నికలు పూర్తయ్యే నాటికి హుజూరాబాద్ లో ఇంకా ఎన్ని వింతలు చూడాల్సి ఉంటుందనే వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.