దళితబంధు నా వల్లే వచ్చిందని భావించారు
హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో ఓటుకు పది వేల రూపాయలు పంచారని ఆరోపించారు. సీఎం కెసీఆర్ అహంకారాన్ని హుజూరాబాద్ ప్రజలు బొందపెట్టారన్నారన్నారు. సీఎం కెసీఆర్ ప్రజలు..ప్రజాస్వామ్యాన్ని నమ్ముకోలేదన్నారు. ఎన్నికల అక్రమాలపై విచారణ జరపాలని కోరతామని తెలిపారు. ప్రభుత్వం వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా దళితబంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు. దళితులకే కాకుండా అర్హులైన బీసీ, మైనారిటీలతోపాటు ఇతర వర్గాలకు కూడా సాయం అందించాల్సిన అవసరం ఉందన్నారు. హూజూరాబాద్ ప్రజలకే తన గెలుపును అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు. శిరస్సు వంచి వారికి నమస్కరిస్తున్నట్లు తెలిపారు.
ప్రతి ఒక్కరిని వేధింపులకు గురిచేశారని విమర్శించారు. స్వేచ్చగా మాట్లాడలేని..తిరగలేని పరిస్థితి వచ్చిందన్నారు. కష్టాలు ఓర్చుకుని మరీ కార్యకర్తలు పనిచేశారని తెలిపారు. పోలీసులే దగ్గరుండి డబ్బులు పంచేలా ఎస్కార్ట్ ఇచ్చారన్నారు. ఇలాంటి సంప్రదాయం రాబోయే రోజుల్లో ఉండొద్దని కోరుకుంటున్నట్లు తెలిపారు. దళిత బంధు రాజేందర్ వల్లే వచ్చిందని దళితులు భావించారన్నారు. రేపట్నుంచే ఐదు అంశాలపై తన పోరాటం ఉంటుందని అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ పథకం అమలు వెంటనే చేయాలన్నారు. అధికారులు కూడా నిజాయతీగా వ్యవహరించలేదన్నారు. సత్వరమే జాబ్ నోటిఫికేషన్లు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఇదిలా ఉంటే రిటర్నింగ్ అధికారి రవీందర్ రెడ్డి నుంచి హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికలలో బిజెపి అభ్యర్థిగా గెలుపొందిన ఈటెల రాజేందర్ శాసనసభ సభ్యులుగా ఎన్నికైనట్లు ధ్రువీకరణ పత్రం అందుకున్నారు.