Telugu Gateway
Telangana

ప్ర‌గ‌తి భ‌వ‌న్ తో ప్ర‌గ‌తి కెసీఆర్ కుటుంబానికే

ప్ర‌గ‌తి భ‌వ‌న్ తో ప్ర‌గ‌తి కెసీఆర్ కుటుంబానికే
X

రెవెన్యూ శాఖ‌ను ఖ‌తం ప‌ట్టించిన సీఎం

తెలంగాణ‌లో రెవెన్యూ శాఖకు మంత్రి లేరు, సెక్రటరీ లేరు, సీసీఎల్ఎ లేరు.. సీఎం కెసిఆర్ ఈ శాఖను ఖతం పట్టించిండు అని విమ‌ర్శించారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటెల రాజేంద‌ర్. ఆయ‌న మంగ‌ళ‌వారం నాడు ధ‌ర్నా చౌక్ వ‌ద్ద వీఆర్ఏలో ధ‌ర్నాలో పాల్గొని వారి స‌మ‌స్య‌ల‌కు సంఘీభావం తెలిపారు. కెసిఆర్ మీకు పాలించే సత్తా లేదా ? అని ప్ర‌శ్నించారు. ఎలుకల బాధకు ఇళ్ళు తగులపెట్టినట్టు ఉంది ఆయ‌న వ్యవహారం అని మండిప‌డ్డారు. అవినీతి చేసే అధికారులపై చర్యలు తీసుకోవాలి తప్ప మొత్తం వ్యవస్థనే రద్దు చేయడం సిగ్గుచేటన్నారు. పోలీసులు, అణచివేత ఉద్యమాలు ఆపలేవని, ఉద్యోగులతో పెట్టుకుంటే బ్రతికి బట్టకట్టరని తెల‌పారు. కెసిఆర్ మీరు ప్రధాని అవ్వండి ఇంకా ఏమన్నా అవ్వండి కానీ ఇక్కడ సమస్యలు పరిష్కారం చేయండి.కూట్లో రాయి తీయలెని వాడు ఏట్లో రాయి తీయడానికి పోయినట్టుంది అని ఎద్దేవా చేశారు. ఏడున్నర సంవత్సరాలుగా కెసిఆర్ ప్రజలను కలిసారా ? ప్రజా దర్బార్ నిర్వహించారా ? . ప్రగతి భవన్ అని పేరు పెట్టుకున్నారు.

కానీ ప్రగతి ప్రజలకు కాదు అయన కుటుంబానికి మాత్రమే జరిగింది. ప్రగతి భవన్ కు ఇనుపకంచెలు వేసుకున్నారు. ప్రజాగ్రహాన్ని మీ పోలీసులు, ఇనుప కంచెలు ఆపలేవ‌ని హెచ్చ‌రించారు. 2017 ఫిబ్రవరి 24 శివరాత్రి రోజున సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు నమ్మి ఆయనకు మీరంతా పాలాభిషేకం చేశారు.. సీఎం మాట అంటే అది ఒక జీవో కావాలి, కానీ కేసీఆర్ మాటలు ఉత్త మాటలు అయ్యాయి. విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ పోస్టులకు ప్రమోషన్ ఉంటుందని భావించి, పీహెచ్ డీ చేసిన వాళ్లు, పీజీ చేసిన వారు కూడా పరీక్షలు రాసి ఎంపికయ్యారు. ప్రమోషన్ వస్తే జాయింట్ కలెక్టర్ దాకా వెళ్దాం అనుకున్నారు. ప్రజలతో ప్రత్యక్ష సంబంధం ఉండే గౌరవించడే పోస్ట్ అని భావించారు, కానీ వారి ఆశ అడియాస అయింది. వారి కళ్ళలో కెసిఆర్ మట్టి కొట్టారు. ఏపీ లో ప్రభుత్వ ఉద్యోగుల చైతన్యం చూశాం. విజయవాడ భగ్గుమంది. కానీ ఇక్కడ ఆ స్వేచ్ఛ లేదు. ధర్నా అని పిలుపు ఇవ్వగానే రాత్రికి రాత్రే అరెస్ట్ చేస్తున్నారు. ధనిక రాష్ట్రంలో డబ్బులు ఎవరికీ పోయాయి? అని ప్ర‌శ్నించారు.

Next Story
Share it