నేనొక్కడినే పాలించాలి..ఇదీ కెసీఆర్ ఆలోచన
ఢిల్లీ వేదికగా ముఖ్యమంత్రి కెసీఆర్ పై మాజీ మంత్రి ఈటెల రాజేందర్ విమర్శలు గుప్పించారు. బిజెపిలో చేరిన అనంతరం ఆయన బండి సంజయ్ తో కలసి మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఎం కెసీఆర్ ది రాజరికపు ఫ్యూడల్ మనస్తత్వం అన్నారు. తెలంగాణ ఉద్యమంలో తన పాత్ర ఏంటో అందరికీ తెలుసన్నారు. తెలంగాణ కోసమే ఇన్ని రోజులు అవమానాలు భరించాం అని వ్యాఖ్యానించారు. చాలా విషయాలు తెలిసినా ప్రభుత్వంలో ఉన్నందున ఆ బాధ్యతలకు కట్టుబడి నోరువిప్పలేదన్నారు. కానీ రెండేళ్లుగా బహిరంగంగానే పలు అంశాలపై తాను మాట్లాడినట్లు రాజేందర్ వెల్లడించారు. రెండవసారి ఎన్నికల్లో 90 సీట్లు వచ్చినా కూడా మూడు నెలల పాటు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయలేదన్నారు. టీఆర్ఎస్ పార్టీని చీల్చటానికి గతంలో కొంత మంది సీఎంలు ప్రయత్నాలు చేశారని..అప్పుడు తాము తీవ్ర విమర్శలు చేయటంతోపాటు ఇదేనా ప్రజాస్వామ్యం అని నిలదీశామన్నారు. కానీ అదే కెసీఆర్ అవసరం లేకపోయినా కాంగ్రెస్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారని విమర్శించారు. అప్పుడు అలా మాట్లాడి ఇప్పుడు ఇలా చేయటం ఎలా సమర్ధనీయం అని ప్రశ్నించారు. పార్టీలోనూ..బయట కూడా ఎవరూ తనకు వ్యతిరేకంగా మాట్లాడే వారు ఉండకూడదనేది కెసీఆర్ ఉద్దేశం అన్నారు.
అందుకే ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారని..ప్రజాస్వామ్యంపై ఆయనకు అసలు నమ్మకమే లేదన్నారు. ఎన్నికలకు ముందు తాను తెలంగాణలో మేధావుల సలహాలు, సూచనలు తీసుకుంటానని చెప్పిన ఆయన కనీసం వారికి అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదన్నారు. ప్రజాస్వామ్య వేదికలపై కెసీఆర్ కు నమ్మకం లేదన్నారు. తానొక్కడు పరిపాలించాలి ..మిగతా వారంతా చూస్తూ ఉంటే చాలు అన్నట్లు ఆయన ధోరణి ఉంటుందని అన్నారు. ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్న వారెవరైనా గుండెల మీద చేయి వేసుకుని స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పగలరా? అని ప్రశ్నించారు. మంత్రుల ఇళ్లలో కూడా తెలుసు వాళ్ల పరిస్థితి ఏంటో అన్నారు. బిజెపిలో చేరటం సంతోషంగా ఉందని..రాబోయే రోజుల్లో ఇంకా చాలా మంది బిజెపిలో చేరతారని ఈటెల రాజేందర్ తెలిపారు. ప్రజాస్వామిక పాలన తేవటమే తమ టార్గెట్ అన్నారు.