ఈటెల రాజేందర్ కంపెనీ భూకబ్జా నిజమే
కీలక పరిణామం. కొంత కాలంపాటు సద్దుమణిగిన ఈటెల రాజేందర్ కు చెందిన కంపెనీల భూకబ్జా వ్యవహారం మరోసారి వెలుగులోకి వచ్చింది. ఈ సారి ఏకంగా కలెక్టర్ మీడియా ముందుకు వచ్చి ఈటెల కంపెనీ కబ్జా నిజమే అని తేల్చారు. ఈ మేరకు మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ సోమవారం నాడు మీడియాకు పలు విషయాలు వెల్లడించారు. మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట్ పరిధిలో అసైన్డ్ భూములను జమునా హ్యాచరీస్ కబ్జా చేసింది వాస్తవమేనని తెలిపారు. 70.33 ఎకరాల భూమిని కబ్జా చేసినట్లు రెవెన్యూ అధికారుల సర్వేలో తేలిందన్నారు.అచ్చంపేట, హకీంపేట పరిధిలో గల సర్వే నంబర్ 77 నుంచి 82, 130, హకీంపేట్ శివారులో గల సర్వే నంబర్ 97, 111లో సీలింగ్ భూములను కబ్జా చేశారు. సర్వే నంబర్ 78, 81, 130లలో భారీ పౌల్ట్రీ షెడ్స్, ప్లాట్‌ఫామ్‌లు, రోడ్లను అనుమతి లేకుండా నిర్మించారు. సర్వే నంబర్ 81లో 5 ఎకరాలు, 130లో 3 ఎకరాలను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మొత్తంగా 56 మంది అసైనీల భూములను కబ్జా చేసినట్లు వెల్లడించారు.
అసైన్డ్ భూములను వ్యవసాయేతర అవసరాలకు వాడుతున్నారని, అనుమతులు లేకుండా పెద్ద పెద్ద షెడ్లు నిర్మించారన్నారు. . నిషేధిత జాబితాలోని భూములను రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు.అసైన్డ్ భూముల కబ్జా, అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వానికి నివేదిక పంపామని తెలిపారు. అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హరీశ్ స్పష్టం చేశారు. అక్రమాలకు సహకరించిన అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. ఈటెల రాజేందర్ ఈ భూకబ్జా వ్యవహారం పెద్ద సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కారణంగానే ఆయన్ను సీఎం కెసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయటం, ఆ తర్వాత ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే కబ్జా నిరూపిస్తే దేనికైనా సిద్ధమే అని గతంలో ఈటెల రాజేందర్ సవాల్ విసిరారు.