Telugu Gateway
Telangana

కెసీఆర్ తొలిసారి అంబేద్క‌ర్ కు దండ‌లు వేస్తున్నారు

కెసీఆర్ తొలిసారి అంబేద్క‌ర్ కు దండ‌లు వేస్తున్నారు
X

హుజూరాబాద్ ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెల‌వాల‌నే ఉద్దేశంతో ఆగ‌మేఘాల మీద తీసుకుంటున్న నిర్ణ‌యాల‌తో సీఎం కెసీఆర్ ప్ర‌తిష్ట మ‌రింత దిగజారుతోంద‌ని మాజీ మంత్రి ఈటెల రాజేంద‌ర్ విమ‌ర్శించారు. సొంత పార్టీ మ‌నుషుల‌ను కొన్న చ‌రిత్ర కూడా కెసీఆర్ దే అన్నారు. చెడపకురా చెడేవు అనే సామెత .. ఇప్పుడు కేసీఆర్ పట్ల నిజమవుతోంద‌న్నారు. కేసీఆర్ నోటి నుంచి ఏ మాట వచ్చినా ఎవరూ నమ్మలేని పరిస్థితి వచ్చింద‌న్నారు. ఆయ‌న గురువారం నాడు మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఓ వైపు కేసీఆర్ మాట్లాడుతుంటే.. మరోవైపు ఇవన్నీ అబద్ధాలేనని మొన్నటి సభలోనే మహిళలు మాట్లాడుకుంటున్నారు. ఎంత మేధావైనా, అనుభవమున్నా.. తన పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారో కేసీఆర్ తెలుసుకునే అవసరం ఉంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, దగ్గరి వాళ్లు ఎవరు చెప్పినా పట్టించుకోని క్యారెక్టర్ ఆయనది. చరిత్రలో రాజులను, చక్రవర్తులను ప్రజలను నేరుగా కలుసుకోకపోయినా.. మారువేషాల్లోప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేవాళ్ళు అన్నారు.హుజురాబాద్ లో ప్రజాస్వామ్యానికి మచ్చతెచ్చేలా టీఆర్ఎస్ నేతలు, ముఖమంత్రి ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఈ ఏడేళ్ళ‌లో తొలిసారి కెసీఆర్ అంబేద్క‌ర్ కు దండ‌లు వేస్తున్నార‌న్నారు.

ద‌ళిత బంధుక‌కు అవ‌స‌ర‌మైన అన్ని నిదులు ఖ‌జానాలో లేవ‌న్నారు. 0.2 శాతం జనాభా ఉన్న మీ సామాజిక వర్గానికి ఉన్న మంత్రిపదవులెన్ని, ఇతర కులాలకు జనాభా వారిగా ఉన్న మంత్రి పదవులెన్ని? 0.2 శాతం ఉన్న మీకు నాలుగు మంత్రి పదవులు, 15 శాతం జనాభా ఉన్న ఎస్సీలకు ఒకే మంత్రి పదవా? తాను ఓపెన్ డిబెట్ కు సిద్ధంగా ఉన్నా... అన్నీ ఖర్చులు పోనూ.. మీరు దళితబంధుకు కనీసం 10 వేల కోట్లైనా కేటాయించే సత్తా మీకుందా? మీరు చెప్పిన లక్షా 70 వేలు ఖర్చు చేయాలంటే 17 ఏళ్లు కావాలి. ఇప్పటికే మూడేళ్లు గడిచింది. ఇంకా రెండేళ్లలో ఎంత ఖర్చు చేస్తారు. 17 ఏళ్లు మీకు అధికారం ఇస్తామని ప్రజలు రాసివ్వ‌లేదు. కేవలం దళితుల ఓట్లమీద ప్రేమతో హైటెక్ సిటీ దగ్గర అమ్మిన భూముల ద్వారా వచ్చిన పైసలను ఇక్కడ ఖర్చు చేస్తున్నారు. మీరు అమ్మిన భూమి చెల్లే ఆస్కారం లేదని, వాళ్ల డబ్బులు వాపస్ ఇవ్వాలని కోర్టు చెప్పింది. కెసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే.. నోటిఫికేషన్ రాకముందే దళితులందరికీ 10 లక్షలు అకౌంట్లో వేయాలి. ఎవరి అజమాయిషీ లేకుండా వాళ్లు స్వేచ్ఛగా డబ్బులు ఖర్చు చేసుకునే అవకాశం ఇవ్వాలి.

Next Story
Share it