డ్రగ్స్, ఈడీ కేసుల్లో కెటీఆర్ పై వ్యాఖ్యలు వద్దు
రేవంత్ కు సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు
డ్రగ్స్ కేసుకు సంబంధించి కీలక పరిణామం. తెలంగాణ మంత్రి కెటీఆర్ సిటీ సివిల్ కోర్టులో దాఖలు చేసిన పిటీషన్ కు సంబంధించి కోర్టు మంగళవారం నాడు కీలక ఆదేశాలు జారీ చేసింది. డ్రగ్స్, ఈడీ కేసుల్లో కెటీఆర్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని కోర్టు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని ఆదేశించింది. ఈ అంశంపై తదుపరి విచారణ అక్టోబర్ 20కి వాయిదా వేసింది. మధ్యంతర ఉత్తర్వులుగా కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. తనకు సంబంధం లేని డ్రగ్స్ కేసులో తనపై ఆరోపణలు చేస్తూ తన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారంటూ కెటీఆర్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.
ఈ పిటీషన్ పై విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. . అయితే రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసి కౌంటర్ దాఖలు చేయటానికి కూడా కోర్టు అనుమతి ఇచ్చింది. తనపై నిరాధార ఆరోపణలు చేస్తూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు యూట్యూబ్ తోపాటు పలు సామాజిక మాధ్యమాల్లో ఉన్నాయని, వాటిని తొలగించేలా కూడా చూడాలన్నారు. కెటీఆర్ పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. అయితే సత్వరమే మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలని కెటీఆర్ తరపు లాయర్లు కోరగా..ఇందుకు కోర్టు సమ్మతించింది.