Telugu Gateway
Telangana

టీఆర్ఎస్ అసంతృప్తి నేతలకు ఆహ్వానం

టీఆర్ఎస్ అసంతృప్తి నేతలకు ఆహ్వానం
X

దుబ్బాక బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు అధికార టీఆర్ఎస్ లో అసంతృప్తిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీలో 30 నుంచి 40 మంది నాయకులు అసంతృప్తితో ఉన్నారని..వారిని బిజెపిలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. రఘునందన్ రావు సోమవారం నాడు తెలంగాణ జర్నలిస్టు యూనియన్ నిర్వహించిన మీట్ ది ప్రెస్ లో మాట్లాడారు. ఎన్నికల్లో తన కోసం కార్యకర్తలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఖచ్చితంగా దుబ్బాక ఎన్నికల ప్రభావం ఉంటుందని అన్నారు. ఆ ఫలితమే ఇక్కడ కూడా రిపీట్ అవుతుందని తెలిపారు. 2013లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తనను బయటకు పంపించిందని రఘునందన్ రావు అన్నారు. ఆనాడు టీఆర్ఎస్ అధ్యక్షుడుగా ఉన్న కేసీఆర్‌కు ఒక మాట చెప్పానని ఆ మాటకు కట్టుబడి ఉన్నానని అన్నారు. పదవి ఉన్నా.. లేకున్నా.. గత పదేళ్లుగా తన పోరాటాన్ని కొనసాగిస్తూ వచ్చాన్నారు.

ఆ రోజు తాను చెప్పిన సబ్జెక్ట్ ఏంటంటే.. ఒక వజ్రాన్ని కోయాలంటే దాన్ని ఇంకో వజ్రంతో మాత్రమే కోయగలుతామని అన్నానని..ఆ మాటకు ఇప్పటికీ, ఎప్పటికీ, భవిష్యత్‌లో కూడా కట్టుబడి ఉన్నానని రఘునందన్ రావు స్పష్టం చేశారు. ''పదవులు ఉన్నా.. లేకపోయినా.., రాజకీయంగా ఎదిగినా.. ఎదగకపోయినా.., ఉన్నతమైన పదవులు వచ్చినా.. రాకపోయినా.. నాకున్న నల్లకోటు.. చంద్రశేఖర్‌రావుని ఎక్కడికి పంపాలో.. అక్కడికి పంపడానికి ఉపయోపగపడుతుందని, భగవంతుడు ఆశీర్వదించాడని, కార్యకర్తలు బలం ఇచ్చారని, కేసీఆర్ కూర్చున్న అసెంబ్లీకి వెళుతున్నానని, ఖచ్చితంగా నూటికి నూరు శాతం 2013లో నేను ఏ మాట చెప్పానో.. ఆ మాటకు కట్టుబడి ఉన్నానని, అది జరిగి తీరుతుందని'' రఘునందన్ రావు స్పష్టం చేశారు.

వరద సాయాన్ని టీఆర్ఎస్ ఓట్ల కొనుగోలుగా మార్చింది. జోనల్ కమిషనర్‌కు 2 లక్షల రూపాయల కంటే ఎక్కువ డబ్బులు డ్రా చేసే అధికారం లేదు. గ్రేటర్ ఎన్నికల తర్వాత 2 లక్షల కంటే ఎక్కువ డ్రా చేసిన జోనల్ కమిషనర్లను కోర్టుకు ఈడ్చుతాం అని తెలిపారు. 'టీఆర్ఎస్‌కు ఓటు వేస్తే.. ఎంఐఎంకు ఓటు వేసినట్లే. హైదరాబాద్‌ను బెంగాల్, కోల్‌కతాగా మార్చవద్దని గ్రేటర్‌ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నాను. పాతబస్తీలో జరుగుతోన్న అసాంఘిక కార్యక్రమాలను బయటకు తీస్తాం. గ్రేటర్ ఎన్నికల తర్వాత కేటీఆర్ కళ్ళు కిందకు దిగుతాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సమాచారాన్ని సేకరించే పనిలో ఉన్నాను. బావ, బావమరిది కాదు.. మా లక్ష్యాన్ని చేరుకోవటమే బీజేపీకి ముఖ్యం' అన్నారు రఘునందన్‌ రావు.

Next Story
Share it