Telugu Gateway
Telangana

తెలంగాణ‌లో డ్రిల్ మెక్ 1500 కోట్ల పెట్టుబ‌డి

తెలంగాణ‌లో డ్రిల్ మెక్ 1500 కోట్ల పెట్టుబ‌డి
X

మెగా ఇంజ‌నీరింగ్ కు చెందిన విదేశీ అనుబంధ సంస్థ డ్రిల్ మిక్ రాష్ట్రంలో గ్లోబల్‌ ఆయిల్‌ రిగ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ హబ్ ను ఏర్పాటు చేయ‌నుంది. హైద‌రాబాద్ కేంద్రంగా ఇది ఏర్పాటు కానుంది. ఈ మేర‌కు తెలంగాణ స‌ర్కారుతో సోమ‌వారం నాడు డ్రిల్ మెక్ అవ‌గాహ‌న ఒప్పందం కుదుర్చుకుంది. డ్రిల్ మెక్ ఎస్ పీఏ యూనిట్ ఏర్పాటు ప్ర‌క‌ట‌న అనే సానుకూల వార్త‌తో ఈ వారం ప్రారంభిస్తున్న‌ట్లు మంత్రి కెటీఆర్ ట్వీట్ చేశారు. 1500 కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డితో ఏర్పాట‌య్యే ఈ యూనిట్ తో 2500 మందికి ఉపాధి అవ‌కాశాలు వ‌స్తాయ‌ని పేర్కొన్నారు. ఈ యూనిట్ ఏర్పాటుకు సంబంధించిన ఒప్పందంపై డ్రిల్ మెక్ ఎస్ పిఏ సీఈవో సిమోన్ ట్రెవిసాని, తెలంగాణ ప‌రిశ్ర‌మ‌ల‌శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ జయేష్ రంజన్‌లు సంతకాలు చేశారు. చమురు, ఇందనం వెలికితీసే హైటెక్ రిగ్గులను తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసి వినియోగంలోకి తెచ్చిన ఘనత మేఘా ఇంజనీరింగ్ (Drillmec SpA) సొంతం చేసుకుంది. ఆన్‌షోర్, ఆఫ్‌షోర్లో చ‌మురు వెలికితీసేందుకు అవ‌స‌ర‌మైన అత్యాధునిక డ్రిల్లింగ్ రిగ్గుల త‌యారీతోపాటు, వర్క్‌ఓవర్ రిగ్‌ల రూపకల్పన, తయారీ, సరఫరాలో గ్లోబల్ లీడర్‌గా ఉంది.

డ్రిల్లింగ్ రిగ్గుల‌కు అవ‌స‌ర‌మైన విస్తృత శ్రేణి విడిభాగాల త‌యారీలో కూడా ప్రపంచవ్యాప్తంగా పేరు ప్ర‌తిష్ట‌త‌ల‌ను సొంతం చేసుకుంది. డ్రిల్‌మెక్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు దాదాపు 600 డ్రిల్లింగ్ రిగ్‌లను పంపిణీ చేసింది. రిగ్గుల రూప‌క‌ల్ప‌న‌లో అనేక వినూత్న డిజైన్లను అభివృద్ధి చేసి ప్రపంచవ్యాప్తంగా పేటెంట్లను పొందింది. ఇటలీలోని పోడెన్‌జానో పిసి కేంద్రంగా రిజిస్టర్డ్ కార్యాలయం ఉన్న డ్రిల్‌మెక్ కంపెనీని 2020లో మెగా గ్రూప్ కొనుగోలు చేసింది. డ్రిల్‌మెక్ ఎస్ పిఏ, తెలంగాణ పరిశ్రమలు & వాణిజ్య శాఖ, తెలంగాణ ప్రభుత్వంతో క‌లిసి రిగ్గు పరికరాల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి స్పెష‌ల్ ప‌ర్ప‌స్ వెహిక‌ల్‌ (SPV)ని ప్రారంభించ‌నుంది. ఈ సంద‌ర్భంగా డ్రిల్‌మెక్ స్పా ప్రతినిధి సిమోన్ ట్రెవిసాని మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం గొప్ప గౌరవమని, ఈ తయారీ యూనిట్ దేశంలో ఇంధన భద్రతకు భరోసా ఇస్తుందని అన్నారు. అంతేకాకుండా "ఈ తయారీ కేంద్రం వ‌ల్ల సుమారు 2,500 మందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని" చెప్పారు.

Next Story
Share it