ఫోన్ మాట్లాడుతూ ఒకేసారి రెండు డోసుల వ్యాక్సిన్
కొంత మంది నిర్లక్ష్యంతో వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఫస్ట్ డోస్ ఒకటి..రెండవ డోస్ వేరే వ్యాక్సిన్ ఇచ్చిన ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. కానీ ఇప్పుడు ఓ నర్స్ ఒకేసారి రెండు డోసులు ఇచ్చేసింది. దీనికి కారణం ఫోన్ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా ఉండటమే అంటున్నారు బాధిత యువతి సంబంధీకులు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్ మెట్ జెడ్పీహెచ్ఎస్‌లో చోటు చేసుకుంది. లక్ష్మీ ప్రసన్న(21) అనే ఓ యువతి కరోనా వ్యాక్సిన్ కోసం వెళ్లింది.
ఆ యువతికి నర్స్ పద్మ.. ఫోన్ మాట్లాడుకుంటూ రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ వెంటవెంటనే ఇచ్చేసింది. దీంతో వ్యాక్సిన్ అనంతరం యువతి స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే ఆమెను వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం లక్ష్మీ ప్రసన్న ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు పేర్కొన్నారు. ఈ డబుల్ డోస్ వ్యాక్సిన్ వ్యవహారం ఒక్కసారిగా కలకలం రేపింది.