Telugu Gateway
Telangana

బిఆర్ఎస్ లో ఏదో లెక్క తేడాకొడుతుంది?

బిఆర్ఎస్ లో ఏదో లెక్క తేడాకొడుతుంది?
X

బిఆర్ఎస్ లో ఏదో జరుగుతోంది. ఇది ఇప్పుడు ఆ పార్టీ నేతలకు కూడా అర్ధం కావటం లేదు. మాజీ సీఎం కెసిఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ఫస్ట్ టైం పేరు పెట్టి డైరెక్ట్ ఎటాక్ కు దిగారు. మాజీ మంత్రి హరీష్ రావు తో పాటు ..మాజీ ఎంపీ సంతోష్ రావు...మేఘా ఇంజనీరింగ్ కంపెనీ అధినేత మేఘా కృష్ణా రెడ్డి పై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేశారు. కాళేశ్వరం అవినీతి వెనక ఉన్నది వీళ్ళే అని ...వీళ్ళ కారణంగానే కెసిఆర్ పై అవినీతి మరక పడింది అని ప్రకటించారు. కెసిఆర్ దగ్గర నుంచి ఆ పార్టీ కీలక నేతలు కేటీఆర్, హరీష్ రావు లు ఎప్పటి నుంచో అసలు కాళేశ్వరం లో అవినీతే లేదు అని చెప్పుకుంటూ వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఒక వైపు రేవంత్ రెడ్డి సర్కారు ఈ వ్యవహారంపై సిబిఐ విచారణకు ఆదేశించిన సమయంలో కవిత ఇందులో భారీ అవినీతి జరిగింది అనే సంకేతాలు ప్రజల్లోకి స్పష్టంగా పంపించారు. అంతే కాదు..హరీష్ రావు అవినీతి తెలిసే ఆయన్ను రెండవ సారి సాగునీటి శాఖకు దూరంపెట్టారు అని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది ఒక్కసారిగా బిఆర్ఎస్ లో పెద్ద కలకలం రేపింది అని చెప్పాలి. విచిత్రంగా హరీష్ రావు తో పాటు సంతోష్ రావు లపై కెసిఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత చేసిన అవినీతి ఆరోపణలను నేరుగా ఎక్కడా ఖండించకుండా బిఆర్ఎస్ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హరీష్ రావు ను ఆరడుగుల బుల్లెట్, సింహం సింగల్ గా వస్తుంది వంటి సినిమా డైలాగులు పెట్టారు.

కేసీఆర్ కు చెందిన ఈ సమర్ధుడైన శిష్యుడి(హరీష్ రావు) నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు , మంత్రులు అయిష్టంగానే నీటిపారుదల గురించి చాలా నేర్చుకున్నారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను అంటూ కేటీఆర్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ లో పెట్టారు. హరీష్ రావు, సంతోష్ రావు లపై ఎక్కడా కూడా కవిత చేసిన అవినీతి ఆరోపణలను కేటీఆర్ కానీ...బిఆర్ఎస్ పార్టీ కానీ ఖండించిన దాఖలాలు లేవు. దీంతో ఈ మొత్తం వ్యవహారంపై బిఆర్ఎస్ లోనే రకరకాల చర్చలు సాగుతున్నాయి. హరీష్ రావు, సంతోష్ రావు లపైకి కాళేశ్వరం అవినీతిని నెట్టి ...కెసిఆర్ కు తెలియకుండానే ఇది అంతా జరిగింది చెప్పే ప్రయత్నం చేస్తున్నారా అనే అనుమానాలు కూడా కొంత మంది పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.

కవితే స్వయంగా హరీష్ రావు అవినీతి తెలిసే ఆయన్ను సాగునీటి శాఖ నుంచి రెండవ సారి కెసిఆర్ పక్కనపెట్టారు అని చెప్పారు. అసలు బిఆర్ఎస్ అధికారంలో ఉన్న తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో ప్రభుత్వంలో కెసిఆర్, కేటీఆర్ కు తెలియకుండా ఏమి జరగలేదు అనే ప్రచారం ఆ పార్టీ నేతల్లోనే ఉంది. ముఖ్యంగా రెండవ టర్మ్ లో ఇది మరింత పెరిగింది అని బిఆర్ఎస్ మాజీ మంత్రులే చెపుతారు. కవిత చెప్పిన విషయాల ప్రకారం కాళేశ్వరం లో హరీష్ రావు అవినీతికి పాల్పడ్డారు అని తెలిసి కూడా రాజయ్య, ఈటల రాజేందర్ లాగా ఆయన పై చర్యలు తీసుకోకుండా కెసిఆర్ వదిలేశారు అనే విషయం కవిత చెప్పకనే చెప్పినట్లు అయింది. ఇది ఇప్పుడు కొత్త రాజకీయ చర్చకు కారణమయ్యే అవకాశం లేకపోలేదు.

Next Story
Share it