నియోజకవర్గాల పెంపు ఇప్పట్లో లేదు
కేంద్రం మరోసారి తేల్చిచెప్పింది. తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన 2031 తర్వాతే ఉంటుందని స్పష్టం చేసింది. అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుపై టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి లోక్‌సభలో ప్రశ్న లేవనెత్తారు. 'ఏపీ విభజన చట్టం ప్రకారం తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 నియోజకవర్గాలను 153 నియోజకవర్గాలుగా పెంచాల్సిన అవరం ఉంది. ఎప్పుడు పెంచుతారు?' అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ సమాధానం ఇచ్చారు. రాజ్యంగంలోని ఆర్టికల్ 170లో చెప్పినట్లు 2026 తర్వాత ప్రచురించే జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని నిత్యానంద్ రాయ్ తెలిపారు. నియోజక వర్గాల పునర్విభజన జరిగితే ఏపీలో ప్రస్తుతం ఉన్న 175 నియోజక వర్గాలను 225కు పెంచుతారు. అలాగే తెలంగాణలోని 119 నియోజకవర్గాలను 153కు పెంచుతారు. వాస్తవానికి విభజన చట్టంలో సీట్లు పెంచాలనే ప్రతిపాదన ఉన్నా కేంద్రం దీన్ని ఏ మాత్రం పట్టించుకోవటం లేదు.