Telugu Gateway
Telangana

కవిత కు మళ్ళీ ఈడీ పిలుపు

కవిత కు మళ్ళీ ఈడీ పిలుపు
X

బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత కు మరో సారి ఈడీ నోటీసు లు జారీ చేసింది. శుక్రవారం నాడు విచారణకు హాజరు కావాలని అందులో కోరింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు చోటు చేసుకున్న ఈ పరిణామం ఎటు వైపు వెళుతుందో అన్న టెన్షన్ బిఆర్ఎస్ నేతల్లో ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణ అంతా కూడా కూడా వెరైటీగా సాగింది అనే విమర్శలు ఉన్నాయి. ఒక్కో సారి ఫుల్ స్పీడ్ గా నడిపి..తర్వాత పూర్తిగా పక్కన పడేయటంతో దీనిపై పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కవితకు తాజాగా ఈడీ నోటీసు లు జారీచేయడంతో ఇప్పుడు ఏం జరుగుతోందోనన్న ఉత్కంఠ నెలకొంది. గతంలోనే కవితను అరెస్ట్ చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. బీజేపీ నేతలు కూడా ఇలాంటి ప్రకటనలు చేశారు. కానీ కవిత అరెస్ట్ జరగక పోవటంతో ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. బీఆర్ఎస్-బీజేపీ ఒక్కటేనని..ఇద్దరు రాజీకి వచ్చారు అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా బహిరంగ సభల్లో బీజేపీ పై విమర్శల దాడి తగ్గించటంతో ఈ అనుమానాలు మరింత పెరిగాయని చెప్పాలి.

తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కాములో కీలక పరిణామం ఏమిటి అంటే సౌత్ గ్రూప్ లో ఉన్న వారు అంతా అంటే కీలక పాత్ర దారులు అఫ్రూవర్లుగా మారిపోయారు. వీరి దగ్గర నుంచి తీసుకున్న స్టేట్ మెంట్స్ ఆధారంగానే ఇప్పుడు కవిత కు నోటీసు లు ఇచ్చారు అని చెపుతున్నారు. అందుకే ఇవి ప్రాధాన్యత సంతరించుకున్నాయి అని చెపుతున్నారు. ఈడీ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. అవి ఈడీ నోటీసు లు కాదు...మోడీ నోటీసు లు అంటూ వ్యాఖ్యానించారు. ఎన్నికలు వస్తున్నాయని మళ్ళీ కొత్త సీరియల్ మొదలు పెట్టారు అని ఎద్దేవా చేశారు. వీటిని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు అని..ఏడాదిగా ఒక సీరియల్ గా నడిపిస్తున్నారు అంటూ కామెంట్ చేశారు. తమ పార్టీ లీగల్ టీం ఈ విషయం చూసుకుంటుంది అని తెలిపారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ నోటీసులు అన్నారు. లీగల్ టీం సలహా మేరకు ముందుకు సాగుతాముని వెల్లడించారు.

Next Story
Share it