లిక్కర్ స్కామ్ లో మీడియా సంస్థలోనూ ఈడీ తనిఖీలు!
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక మలుపు. తాజాగా దేశ వ్యాప్తంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ) అధికారులు మరోసారి తనిఖీలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే కేసులో అరెస్ట్ వారు ఇచ్చిన వివరాల ఆధారంగా తాజాగా ఈ దాడులు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో ఓ తెలుగు పత్రిక కార్యాలయంలోనూ సోదాలు సాగుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ పత్రిక యాజమాన్యానికి ఓ ఆంగ్ల ఛానల్ కూడా ఉంది. ఈ కేసులో ఉన్న వ్యక్తుల్లో ఒకరు ఇందులో పెట్టుబడులు పెట్టారని..దీనికి లిక్కర్ స్కామ్ కు మధ్య ఉన్న లింక్ లపై ఈడీ ఆరా తీస్తోంది. ఆ పత్రిక చాలా కాలం నుంచే అదికారిక పత్రికను మించి మరీ భజన చేస్తోందనే విమర్శలు ఎదుర్కొంటోంది.
తాజాగా ఈడీ అధికారులు ఢిల్లీ, హైదరాబాద్ తోపాటు ముంబయ్, పంజాబ్ తదితర ప్రాంతాల్లో ఏకంగా 35 చోట్ల తనిఖీలు చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ వెలుగులోకి వచ్చిన తర్వాత ఇందులో టీఆర్ఎస్ అధినేత, సీఎం కెసీఆర్ కుమార్తెపై బిజెపి నేతలు సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఆమె ఈ కేసులో ఏ విచారణ అయినా చేయించుకోవచ్చంటూ కవిత సవాల్ విసిరారు. అయితే లిక్కర్ స్కామ్ విచారణ చేస్తుండగా అటు ఐటి, ఇటు ఈడీ అధికారులకు భారీ ఎత్తున బినామీ లావాదేవీల వ్యవహారం వెలుగులోకి వచ్చిందని..ప్రస్తుతం అధికారులు వీటి లెక్క తేల్చేపనిలో ఉన్నారని చెబుతున్నారు. తాజా ఈడీ దాడులతో వ్యవహారం ఎవరి మెడకు చుట్టుకుంటుందో అన్న టెన్షన్ రాజకీయవర్గాల్లో ఉంది.