కొత్త విషయాలు బయటపెట్టిన సిబిఐ
శరత్ చంద్రా రెడ్డి ని కవిత బెదిరించారు
ఢిల్లీ లిక్కర్ స్కాం లో సిబిఐ ఇప్పుడు కొత్త కోణం బయటపెట్టింది. ఇంత కాలం ముడుపుల విషయాన్ని చెపుతూ వచ్చిన ఈ విచారణ సంస్థ ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్సీ కవిత డబ్బుల కోసం అరబిందో డైరెక్టర్ శరత్ చంద్ర రెడ్డి ని బెదిరించారు అని సిబిఐ ఆరోపించింది. ఇది ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది అనే చెప్పాలి. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాం లో కవిత ను ఈడీ అరెస్ట్ చేయగా...తాజాగా ఆమెను సిబిఐ కూడా అదుపులో తీసుకున్న విషయం తెలిసిందే. కవిత కస్టడీ కోరుతూ సిబిఐ కోర్ట్ కు సమర్పించిన నివేదికలో సంచలన విషయాలను ప్రస్తావించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం లో కవితే ప్రధాన పాత్రధారి..సూత్రధారి అని చెపుతూ పలు కొత్త విషయాలను కూడా ప్రస్తావించింది. ఈ స్కాం కు సంబంధించి కవితే వంద కోట్ల రూపాయలు చెల్లించినట్లు పేర్కొన్నారు. లిక్కర్ స్కాం లో సహ నిందితుడుగా ఉన్న శరత్ చంద్రారెడ్డి కవిత జాగృతి సంస్థకు 80 లక్షల రూపాయలు ముడుపులు చెల్లించినట్లు సీబీఐ తెలిపింది. డబ్బుల కోసం శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించారని సీబీఐ వెల్లడించింది. ల్యాండ్ డీల్ చేసుకోకపోతే తెలంగాణలో బిజినెస్ ఎలా చేస్తావో చూస్తానని శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించినట్లు కస్టడీ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. అసలు భూమే లేకుండా వ్యవసాయ భూమి కొనుగోలు చేసినట్లు అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించారంది. నకిలీ భూ విక్రయం పేరుతో శరత్ చంద్రారెడ్డి నుంచి 14 కోట్లు కవిత తీసుకున్నారని సీబీఐ ఆరోపించింది. ఢిల్లీ లిక్కర్ బిజినెస్‌కు పరిచయం చేసినందుకు కవితకు చెందిన తెలంగాణ జాగృతి సంస్థకు శరత్ చంద్రారెడ్డి 80లక్షలు చెల్లించారన్నారు.
మహబూబ్ నగర్‌లో వ్యవసాయ భూమి ఉందని, దాన్ని కొనుగోలు చేసినట్లు 14 కోట్ల రూపాయలు ఇవ్వాలని శరత్ చంద్రారెడ్డిని కవిత డిమాండ్ చేస్తే...అసలు ఆ భూమి సంగతి, దాని ధర ఎంతో తెలియనందువల్ల తాను 14కోట్లు ఇవ్వలేనని శరత్ చంద్రారెడ్డి చెపితే తాను కోరినట్లు డబ్బులు ఇవ్వకపోతే తెలంగాణలో అరబిందో ఫార్మా బిజినెస్ ఉండదని కవిత బెదిరించారని సీబీఐ తన కస్టడీ రిపోర్ట్‌లో పేర్కొంది. ఒక్కో రిటైల్ జోన్‌కి 5 కోట్ల రూపాయల చొప్పున 5 రిటైల్ జోన్లకు 25 కోట్ల రూపాయలు ఇవ్వాలని శరత్ చంద్రారెడ్డిని కవిత డిమాండ్ చేసినట్లు సిబిఐ పేర్కొంది. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని కూడా కవిత రూ. 50 కోట్లు డిమాండ్ చేసారని..అయితే తన కుమారుడు మాగుంట రాఘవ ద్వారా కవితకు ఆయన రూ.25కోట్లు చెల్లించారని సిబిఐ ఆరోపించింది. కేజ్రీవాల్ అనుచరుడు విజయనాయర్‌కి కవితే రూ.100కోట్లు చెల్లించారని సీబీఐ వెల్లడించింది. గోవాకు 44.45 కోట్ల రూపాయలు హవాలా మార్గంలో బదిలీ చేసినట్లు తెలిపారు. ఈ డబ్బును కవిత పిఏ అశోక్ కౌశిక్ హవాలా డీలర్లకు చేర్చాడు అని సిబిఐ తన నివేదికలో ప్రస్తావించింది. ఈ విషయాలన్నింటిపైనా కవిత సరైన సమాధానాలు చెప్పడం లేదని.. ఆమెను 5 రోజులు కస్టడీలోకి తీసుకొని మరిన్ని విషయాలను రాబట్టాల్సి ఉందని కోర్టును సీబీఐ కోరింది. అయితే కోర్టు మాత్రం మూడు రోజుల కస్టడీకి అనుమతించింది. దీంతో కవిత ఏప్రిల్ 15 వరకు సిబిఐ కస్టడీ లో ఉండనున్నారు. సిబిఐ అరెస్ట్ ను కవిత సవాల్ చేసినా కూడా తమ అనుమతి తో అరెస్ట్ జరిగింది అని కోర్టు తెలపటంతో ఆమె ఎక్కడా ఊరట లభించలేదు.